Skip to main content

విద్య స్టార్టప్‌లకు 222 కోట్ల డాలర్ల పెట్టుబడులు: ఐవీసీఏ-పీజీఏ ల్యాబ్స్ నివేదిక

న్యూఢిల్లీ: భారత విద్యారంగ స్టార్టప్‌ల్లో ఈ ఏడాది జోరుగా పెట్టుబడులు వచ్చాయి. గత ఏడాది ఎడ్యుటెక్ స్టార్టప్‌ల్లో 55.3 కోట్ల డాలర్ల పెట్టుబడులు రాగా ఈ ఏడాది ఈ స్టార్టప్‌ల్లో 222 కోట్ల డాలర్ల పెట్టుబడులు వచ్చాయని ఐవీసీఏ-పీజీఏ ల్యాబ్స్ నివేదిక వెల్లడించింది.
కరోనా కల్లోలం నేపథ్యంలో ఎడ్యుటెక్ స్టార్టప్‌ల వృద్ధి జోరుగా ఉండటంతో ఈ సెగ్మెంట్ స్టార్టప్‌లపై ఇన్వెస్టర్లకు విశ్వాసం మరింతగా పెరిగిందని ఈ నివేదిక పేర్కొంది. కరోనా కల్లోలాన్ని అడ్డుకోవడానికి లాక్‌డౌన్ విధించడం వల్ల ఎడ్యుటెక్ ఉత్పత్తులకు డిమాండ్ బాగా పెరిగిందని వివరించింది. ‘ద గ్రేట్ అన్-లాక్‌డౌన్, ఇండియన్ ఎడ్యుటెక్’ పేరుతో ఇండియన్ ప్రైవేట్ ఈక్విటీ అండ్ వెంచర్ క్యాపిటల్ అసోసియేషన్ (ఐవీసీఏ), పీజీఏ ల్యాబ్స్ రూపొందించిన ఈ నివేదిక ఇంకా ఏం చెప్పిందంటే...,
  • గత ఐదేళ్లలో భారత ఆన్‌లైన్ ఎడ్యుకేషన్ కంపెనీలు దాదాపు 400 కోట్ల డాలర్ల మేర పెట్టుబడులను సమీకరించాయి. వీటిలో అధిక భాగం నిధులను బైజుస్, అన్‌అకాడెమీ, వేదాంతు స్టార్టప్‌లు రాబట్టాయి.
  • బైజుస్ స్టార్టప్‌లో గత ఐదేళ్లలో 232 కోట్ల డాలర్ల నిధుల లభించాయి. ఈ స్టార్టప్ ప్రస్తుత విలువ 1,200 కోట్ల డాలర్లని అంచనా.
  • అన్‌అకాడెమి సంస్థ గత ఐదేళ్లలో 35.4 కోట్లడాలర్లను రాబట్టింది. ఈ స్టార్టప్ ప్రస్తుత విలువ 200 కోట్ల డాలర్లని అంచనా.
  • ఇంటర్మీడియట్ (కే-12), పరీక్షలకు ప్రిపేర్ చేసే స్టార్టప్‌ల్లో అధికంగా నిధులు వచ్చాయి. ఈ తరహా స్టార్టప్‌ల్లో 198 కోట్ల డాలర్ల పెట్టుబడులు వచ్చాయి.
  • ఆ తర్వాతి స్థానాల్లో కంటిన్యూడ్ లెర్నింగ్ స్టార్టప్‌లు(14.2 కోట్ల డాలర్లు), ఉన్నత విద్య (8.4 కోట్ల డాలర్లు), ప్రి-కే(1.2 కోట్ల డాలర్లు), బీ2బీ ఎడ్యుటెక్ కంపెనీలు(70 లక్షల డాలర్లు) నిలిచాయి.
  • గత ఆర్థిక సంవత్సరంలో భారత్‌లో మొత్తం విద్యార్థుల సంఖ్య 36 కోట్లని, ఎడ్యుకేషన్ మార్కెట్ 11,700 కోట్ల డాలర్లని ఈ నివేదిక అంచనా వేస్తోంది. పాఠశాల విద్య కోసం 4,900 కోట్ల డాలర్లు, శిక్షణ కోసం 4,200 కోట్ల డాలర్లు వ్యయమయ్యాయి.
  • ఐదేళ్లలో భారత్‌లో విద్యామార్కెట్ 14 శాతం చొప్పున చక్రగతిన వృద్ధి చెందుతుంది. 2024-25 నాటికి విద్యా మార్కెట్ 22,500 కోట్ల డాలర్లకు చేరుతుంది. పెట్టుబడులకు మంచి అవకాశాలు ఉన్నాయి.
Published date : 18 Dec 2020 02:12PM

Photo Stories