Skip to main content

ఉపకారవేతనాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్ దరఖాస్తు గడువు పెంపు

సాక్షి, హైదరాబాద్: పోస్టుమెట్రిక్ విద్యార్థుల ఉపకారవేతనాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాలకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియను ప్రభుత్వం పొడిగించింది.
తొలుత దరఖాస్తు స్వీకరణకు డిసెంబర్ 31, 2020ని డెడ్‌లైన్‌గా పెట్టినప్పటికీ... అడ్మిషన్ల ప్రక్రియ ఆలస్యం కావడం, దానికితోడు రెన్యువల్ విద్యార్థులు సైతం ఇంకా పూర్తిస్థాయి దరఖాస్తులు సమర్పించకపోవడంతో ప్రభుత్వం ఈమేరకు నిర్ణయం తీసుకుంది. ఫిబ్రవరి 15వ తేదీ వరకు ఈపాస్ ద్వారా ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణకు గడువు పొడిగించింది.

రెన్యువల్ కేటగిరీలో 79 శాతం :
ఉపకారవేతనాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాలకు పోస్టుమెట్రిక్ కోర్సులకు సంబంధించి 2020-21 విద్యాసంవత్సరంలో 12.65 లక్షల మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకుంటారని సంక్షేమ శాఖలు అంచనా వేశాయి. కోవిడ్-19 ప్రభావంతో విద్యా సంవత్సరం ఆలస్యంగా ప్రారంభం కావడం, అడ్మిషన్ల ప్రక్రియలో తీవ్ర జాప్యం నెలకొనడంతో దరఖాస్తులకు రెండు నెలలు ఆలస్యమైంది. సెప్టెంబర్‌లో ప్రారంభించిన స్వీకరణ ప్రక్రియకు డిసెంబర్ 31 గడువు విధించింది. నిర్దేశించిన గడువులోగా రెన్యువల్ విద్యార్థుల్లో 6.33 (79 శాతం) లక్షల మంది దరఖాస్తులు సమర్పించగా... ఫ్రెషర్స్ కేటగిరీలో మెజారిటీ కోర్సులకు సంబంధించి దరఖాస్తు ప్రక్రియే ప్రారంభం కాలేదు. సెట్ కన్వీనర్ల నుంచి ర్యాంకుల వారీగా సీటు అలాట్‌మెంట్‌కు సంబంధించిన డాటా సంక్షేమ శాఖలకు అందకపోవడంతోనే ఈ పరిస్థితి నెలకొన్నట్లు తెలుస్తోంది.
Published date : 02 Jan 2021 04:47PM

Photo Stories