Skip to main content

ఉద్యోగులకు పండగ కానుక‌లు ఇవే...: నిర్మలా సీతారామన్‌

సాక్షి, న్యూఢిల్లీ : కరోనా వైరస్‌తో కుదేలైన ఆర్థిక వ్యవస్థలో ఉత్తేజం నింపేందుకు, డిమాండ్‌ను పెంచేందుకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ అక్టోబ‌ర్ 12వ తేదీన‌ పలు చర్యలు ప్రకటించారు.
వినిమయాన్ని పెంచేందుకు ప్రభుత్వ ఉద్యోగులకు ఎల్టీసీ క్యాష్‌ వోచర్‌, పండుగ ప్రత్యేక అడ్వాన్స్‌ పథకాలను ప్రవేశపెడుతున్నామని చెప్పారు. ఎల్టీసీ నగదును 12 శాతం ఆపై జీఎస్టీ విధించే వస్తువులపై ఖర్చు పెట్టాలని, డిజిటల్‌ మాధ్యమం ద్వారా వీటిని వెచ్చించాలని ఆమె స్పష్టం చేశారు. జీఎస్టీ ఇన్వాయిస్‌ను సమర్పించాల్సి ఉంటుందని చెప్పారు. కరోనా వైరస్‌తో ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతిన్నదని, పేదలు, చిన్న పరిశ్రమలను ఆదుకునేందుకు ఆత్మనిర్భర్‌ ప్యాకేజ్‌ ప్రకటించగా తాజాగా వ్యవస్థలో డిమాండ్‌కు ఊతమిచ్చే చర్యలను ప్రకటించామని చెప్పారు. వస్తువులను కొనుగోలు చేయడానికి వోచర్లు వాడే అవకాశం కల్పిస్తున్నామని, తమకు నచ్చిన ప్రాంతానికి, తమ సొంత ఊరికి వెళ్లేందుకు ఎల్‌టీసీ సదుపాయం అందుబాటులో ఉందని పేర్కొన్నారు. వీటిపై ఎలాంటి ఆదాయం పన్ను ఉండదని స్పష్టం చేశారు. ఆర్థిక​ వ్యవస్థలో దూకుడు పెంచేందుకు వినియోగదారుల నుంచి డిమాండ్‌, మూలధన వ్యయం పెరగాల్సి ఉందని నిర్మలా సీతారామన్‌ పేర్కొన్నారు. ఇక జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశంలో రాష్ట్రాలకు పరిహారం విషయంపై సోమవారం మద్యాహ్నం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ కీలక సమావేశంలో పాల్గొంటారు.
Published date : 12 Oct 2020 01:57PM

Photo Stories