Skip to main content

ట్యూషన్‌ ఫీజు అంటే? ఏమిటో.. తేల్చే పనిలో పడిన విద్యాశాఖ..!

సాక్షి, హైదరాబాద్‌: లైబ్రరీ, ల్యాబ్, స్పోర్ట్స్‌కు గతంలో వేర్వేరుగా ఫీజులను వసూలు చేసిన కార్పొరేట్, బడా ప్రైవేటు పాఠశాలలు ఇప్పుడు అన్నింటినీ ట్యూషన్‌ ఫీజు కిందే వేస్తున్నాయి.. కరోనా కారణంగా ప్రజల జీవన పరిస్థితులు అస్తవ్యస్తం కావడంతో ప్రభుత్వం 2020–21 విద్యా సంవత్స రంలో ట్యూషన్‌ ఫీజులు మాత్రమే, అదీ నెల వారీగా తీసుకోవాలని జీవో 46ను జారీ చేసింది.
ఇదే ఆసరాగా తీసుకున్న ప్రైవేటు యాజ మాన్యా లు.. ల్యాబ్, లైబ్రరీ, స్పోర్ట్స్, ఇతరత్రా ఫీజు లను వేర్వేరుగా చూపించకుండా అన్నీ కలిపి ట్యూషన్‌ ఫీజు కిందే వేసి తల్లిదండ్రుల నుంచి వసూళ్లు చేస్తు న్నాయి. ఫిబ్రవరి 1వ తేదీ నుంచి ప్రారంభమైన 3 నెలల ప్రత్యక్ష బోధన కోసం సంవత్సరం ఫీజును ఇలా వసూలు చేస్తున్నట్లు ఫిర్యాదులు రావడంతో విద్యాశాఖ ఆలోచనల్లో పడింది. అందుకే ట్యూషన్‌ ఫీజు అంటే ఏంటి? అందులో ఏమేం వస్తాయన్నది తేల్చేందుకు సిద్ధ మైంది. ఫీజుల వసూలు విధాన మెలా ఉండాలి? ఫీజుల నియంత్రణ ఎలా చేపట్టా లన్న అంశంపై కసరత్తు ప్రారంభించింది. ఇప్పటికే దీనిపై విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, విద్యాశాఖ ప్రధాన కార్యదర్శి చిత్రా రామచంద్రన్, పాఠశాల విద్యాడైరెక్టర్‌ దేవసేన చర్చించారు.

కొన్నేళ్లుగా డిమాండ్‌..
ప్రైవేటు స్కూళ్ల ఫీజులు నియంత్రించాలనే డిమాండ్‌ ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పటి నుంచే ఉంది. ఏటా విద్యా సంవత్సరం ప్రారంభంలో ఫీజుల పెంపుపై తల్లిదండ్రులు ఆందోళన చేయడం, విద్యా శాఖ కొంత హడావుడి చేసి వదిలేయడం పరిపాటి అయింది. వీటికి తోడు న్యాయ వివాదాలతో ఫీజుల నియంత్రణ వ్యవహారం ఒక అడుగు ముందుకు రెండు అడుగులు వెనక్కి అన్న చందంగా మారింది. 2009 ఉమ్మడి రాష్ట్రం నుంచే ఫీజుల నియంత్రణకు అప్పటి సర్కార్‌ చర్యలు చేపట్టగా.. వివిధ దశల్లో కోర్టు తీర్పుల నేపథ్యంలో ఏ నిర్ణయం తీసుకోలేకపోయింది. ఇక ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడ్డాక ఫీజుల నియంత్రణపై ప్రొఫెసర్‌ తిరుపతిరావు నేతృత్వంలో ప్రభుత్వం ఓ కమిటీని 2017 ఏప్రిల్‌లో ఏర్పాటు చేసింది. ఆ కమిటీ ఇటు తల్లిదండ్రులు, అటు పాఠశాలల యాజమాన్యాలతో సమావేశాలు నిర్వహించేందుకే అధిక సమయం పట్టింది. దీంతో 2017లోనే యాజమాన్యాలు ఇష్టారాజ్యంగా ఫీజులను పెంచేశాయి. ఇక 2018–19 విద్యా సంవత్సరం వరకు సమావేశాలు, నివేదిక రూపకల్పనతోనే గడిచిపోయింది. ఎట్టకేలకు 2018 ఫిబ్రవరిలో ప్రొఫెసర్‌ తిరుపతిరావు కమిటీ ప్రభుత్వానికి నివేదికను అందజేసింది. ఆ నివేదిక ఇప్పటికీ ప్రభుత్వ పరిశీలనలోనే ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో 10,725 వరకు ప్రైవేటు స్కూళ్లున్నాయి. వాటిల్లో ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకే 31 లక్షల మందికిపైగా విద్యార్థులు చదువుతున్నారు. వారు కాకుండా నర్సరీ, ఎల్‌కేజీ, యూకేజీ పిల్లలు మరో 7–8 లక్షల మంది వరకు చదువుతున్నట్లు అంచనా. అయితే వాటిల్లో ఫీజుల విధానం, వాటిపై నియంత్రణ అంటూ ఏమీ లేకుండాపోయింది. యాజమాన్యాలు నిర్ణయించిందే ఫీజు.. రూ.10 వేల నుంచి మొదలుకొని రూ.3.5 లక్షల వరకు వార్షిక ఫీజును వసూలు చేస్తున్న పాఠశాలలున్నాయి.

10 శాతం పెంపు అశాస్త్రీయం..
ఇక రాష్ట్రంలోని ప్రైవేటు పాఠశాలలు 2016–17లో ఉన్న ఫీజులపై ఏటా ఫీజులను 10 శాతం లోపు పెంచుకోవచ్చని, అందుకు ఎలాంటి అనుమతులు తీసుకోవాల్సిన అవసరం లేదని తిరుపతిరావు కమిటీ సిఫారసు చేసింది. ఇదే అసలు సమస్యగా మారింది. సదుపాయాలపై శాస్త్రీయ అంచనా లేకుండా ఏటా 10 శాతం ఫీజులను పెంచుకునేలా ఎలా సిఫారసు చేశారంటూ ప్రొఫెసర్‌ తిరుపతిరావు కమిటీని ప్రభుత్వం ప్రశ్నించింది. తాజాగా విద్యాశాఖ వాటిపై ఆలోచనలు మొదలుపెట్టింది. ఆ సిఫారసుల్లోని లోపాలను తొలగించడంతో పాటు పక్కాగా ఫీజుల నియంత్రణకు ఎలాంటి చర్యలు చేపట్టాలనే అంశాలపై కసరత్తు ప్రారంభించింది. ఇందుకోసం హైదరాబాద్‌ పరిసర జిల్లాల్లో డీఈవోలతోనూ కమిటీ వేసింది. ఫీజుల నియంత్రణకు ఎలాంటి విధానాలు అవసరమన్న దానిపై పక్కాగా, న్యాయ వివాదాలు తలెత్తకుండా ఎలా చర్యలు చేపట్టాలన్న దానిపై దృష్టి సారించింది.
Published date : 26 Feb 2021 04:21PM

Photo Stories