Skip to main content

త్వరలో 12,505 విద్యా వలంటీర్ల నియామకానికి నోటిఫికేషన్.. పూర్తి సమాచారం ఇదిగో!

సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని పాఠశాలల్లో విద్యా వలంటీర్లను నియమించేందుకు విద్యాశాఖ కసరత్తు చేస్తోంది.
పాఠశాలల్లో ప్రత్యక్ష బోధనను ఇప్పటివరకు ప్రారంభించనందున వలంటీర్లను విద్యాశాఖ రీఎంగేజ్ (పునర్నియామకం) చేయలేదు. అయితే తామంతా దానిపైనే ఆధారపడి ఉన్నామని, తమను రీఎంగేజ్ చేయాలని విద్యా వలంటీర్లు (వీవీ) ఇప్పటికే పలుమార్లు మంత్రి సబితా ఇంద్రారెడ్డి, విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రా రామ్‌చంద్రన్, పాఠశాల విద్యా కమిషనర్ దేవసేనలకు విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలోనే విద్యా వలంటీర్ల అంశంపై విద్యాశాఖ దృష్టి సారించింది. డిసెంబర్ లేదా జనవరిలో పాఠశాలల్లో ప్రత్యక్ష బోధన ప్రారంభించనున్న నేపథ్యం లో విద్యా వలంటీర్లను కూడా పునర్నియమించేందుకు ప్రభుత్వా నికి ప్రతిపాదనలను విద్యాశాఖ పంపినట్లు సమాచారం.

ఈ ఏడాదికి 12,505 మంది వీవీలు..
2020-21 విద్యా సంవత్సరంలో మొత్తంగా 12,505 మంది విద్యా వలంటీర్లు అవసరమని విద్యాశాఖ అంచనా వేసింది. వారికి వచ్చే నాలుగు నెలల్లో వేతనాల కోసం దాదాపు రూ.60 కోట్లు బడ్జెట్ అవసరమవుతుందని కూడా లెక్కలు వేసింది. మరోవైపు 2019-20 విద్యా సంవత్సరానికి సంబంధించి 13 జిల్లాల్లో విద్యా వలంటీర్లకు వేతన బకాయిలు చెల్లించాల్సి ఉంది. అవి ఇప్పటివరకు చెల్లించకపోవడంతో వారంతా ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలోనే వారి వేతనాల విడుదల కోసం విద్యాశాఖ ప్రభుత్వ ఆమోదానికి ఫైలు పంపించినట్లు తెలిసింది. యాదాద్రి భువనగిరి, వరంగల్ అర్బన్, జనగామ, సూర్యాపేట, కామారెడ్డి, వరంగల్ రూరల్, ఖమ్మం, నిజామాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్, హైదరాబాద్, మహబూబాబాద్ జిల్లాల్లో విద్యా వలంటీర్లకు గతేడాదికి సంబంధించి దాదాపు రూ.3 కోట్ల వేతన బకాయిలు చెల్లించాల్సి ఉంది. త్వరలోనే ఆ బకాయిలను ప్రభుత్వం విడుదల చేస్తుందని విద్యాశాఖ వర్గాలు పేర్కొంటున్నాయి.
Published date : 18 Nov 2020 02:39PM

Photo Stories