‘టీచర్లంతా స్కూళ్లకు హాజరుకావాల్సిందే’
Sakshi Education
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రభుత్వ టీచర్లంతా ప్రతిరోజూ స్కూళ్లకు హాజరై బయోమెట్రిక్ వేయాల్సిందేనని పాఠశాల విద్యా శాఖ స్పష్టం చేసింది.
ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ వాడ్రేవు చినవీరభద్రుడు బుధవారం సర్క్యులర్ జారీ చేశారు. ఈనెల 2 నుంచి 9, 10 తరగతులను, 23వ తేదీ నుంచి 6, 7, 8 తరగతులను, డిసెంబర్ 14 నుంచి 1-5 తరగతులను ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఆదేశాలు జారీ చేసింది. ప్రైమరీ, యూపీ, హైస్కూలు తరగతుల పునఃప్రారంభానికి వేర్వేరు తేదీలు ప్రకటించినందున టీచర్లు ఆయా తేదీల నుంచి హాజరు కావాలా? ఇప్పటినుంచే వెళ్లాలా? అన్న సందేహాలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో పాఠశాల విద్యా శాఖ స్పష్టత ఇచ్చింది. ప్రైమరీ, యూపీ, హైస్కూళ్ల టీచర్లంతా ప్రతిరోజూ స్కూళ్లకు రావాల్సిందేనని ఆదేశించింది. తరగతులు ప్రారంభం కాని టీచర్లు ఉదయం పూట వర్క్‌షీట్లు, టీచింగ్ మెటీరియల్ సిద్ధం చేసుకోవాలని, మధ్యాహ్నం ఆన్‌లైన్ తరగతుల్లో పాల్గొనాలని సూచించింది. అలాగే 9, 10 తరగతులలో విద్యార్థుల సంఖ్య ఎక్కువ ఉండి.. గదికి 16 మందినే కూర్చోబెట్టే పరిస్థితుల్లో అదనపు సెక్షన్లు ఏర్పాటు చేసుకోవాలని పేర్కొంది. ఇందుకు అవసరమైన టీచర్లు అందుబాటులో లేకపోతే సమీపంలోని యూపీ, ప్రైమరీ టీచర్లు.. తమ పాఠశాలలు తెరిచే వరకు ఆయా హైస్కూళ్లలో పనిచేయాలని సూచించింది.
Published date : 05 Nov 2020 03:05PM