Skip to main content

తెలుగు విద్యార్థులకు సర్కారు అండ

సాక్షి, అమరావతి/యూనివర్సిటీ క్యాంపస్ (తిరుపతి): కరోనా వైరస్ కారణంతో మలేసియా రాజధాని కౌలాలంపూర్ విమానాశ్రయంలో చిక్కుకుపోయి తీవ్ర అవస్థలు పడుతున్న తెలుగు విద్యార్థులను స్వస్థలాలకు రప్పించేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది.
వారందరినీ క్షేమంగా తీసుకువచ్చేందుకు తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు. పార్టీ నేతలను అప్రమత్తం చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి హుటాహుటిన కేంద్ర విదేశాంగ మంత్రి సుబ్రమణ్యం జైశంకర్‌ను సంప్రదించారు. విద్యార్థులందరినీ తీసుకువచ్చేందుకు అవసరమైన ఏర్పాట్లుచేయాలని విజయసాయిరెడ్డి విజ్ఞప్తి చేయడంతో కేంద్రమంత్రి సానుకూలంగా స్పందించారు. కౌలాలంపూర్ నుంచి విశాఖపట్నం, ఢిల్లీకి ఎయిర్ ఏషియా విమానాలు నడిపేందుకు ఆయన అనుమతించారు. ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారు ఎయిర్ ఏషియా సంస్థను సంప్రదించాలన్నారు. మరోవైపు.. ఎప్పటికప్పుడు ఇందుకు సంబంధించిన విషయాలు నివేదించాలని ఢిల్లీ ఏపీ భవన్ అధికారులను సీఎం ఆదేశించారు.

కౌలాలంపూర్‌లో విద్యార్థుల అవస్థలు
అంతకుముందు.. కోవిడ్-19 వల్ల ఫిలిప్పీన్స్ దేశంలోని విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించడంతో అక్కడ చదువుతున్న తెలుగు విద్యార్థులు సొంతూళ్లకు బయల్దేరారు. ఏపీ, తెలంగాణతో పాటు వివిధ రాష్ట్రాలకు చెందిన సుమారు 500 మంది విద్యార్థులు ఫిలిప్పీన్స్ రాజధాని మనీలా, అలాగే కావైట్ పట్టణంలో చదువుతున్నారు. ఇందులో తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు 120 మంది ఉన్నట్లు సమాచారం. మనీలాలో ఇప్పటివరకు 100 పాజిటివ్ కేసులు.. కావైట్‌లో ఐదు కేసులు నమోదయ్యాయి. దీంతో తమకు ఏప్రిల్ 30 వరకు సెలవులు ప్రకటించారని అక్కడి విద్యార్థులు తెలిపారు. తమను కళాశాల యాజమాన్యం గురువారం సాయంత్రంలోపు ఖాళీచేయాలని.. లేనిపక్షంలో నిర్బంధిస్తామని హెచ్చరికలు జారీచేసిందన్నారు. అంతేకాక.. అనుమతి లేకుండా వీధుల్లో సంచరిస్తే కాల్చివేస్తామని కూడా హెచ్చరికలు చేసిందని వాపోయారు. దీంతో వారంతా మలేసియా రాజధాని కౌలాలంపూర్ విమానాశ్రయానికి చేరుకున్నారు. కానీ, అక్కడ భారత్ వెళ్లే విమానాలన్నీ రద్దు చేయడంతో వీరంతా ఎయిర్‌పోర్టులోనే చిక్కుకుపోయారు. వీరిలో కృష్ణా, గుంటూరు, చిత్తూరు జిల్లాలకు చెందిన విద్యార్థులున్నారు. వీరంతా ఇప్పుడు స్వస్థలాలకు చేరుకుంటామా లేదా అని ఆందోళన చెందుతున్నారు. సరైన ఆహారం దొరక్క అవస్థలు పడుతున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ చొరవతో కేంద్రం ప్రత్యేక విమానాలు నడిపేందుకు అంగీకరించడంతో వారంతా స్వస్థలాలకు సురక్షితంగా వచ్చేందుకు మార్గం సుగమమైంది.
Published date : 18 Mar 2020 04:55PM

Photo Stories