Skip to main content

తెలంగాణ జీఏడీలో కొత్తగా నైట్‌షిఫ్టులు.. సెలవు రోజుల్లోనూ..

సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర పరిపాలన వ్యవహారాల్లో కీలకమైన సాధారణ పరిపాలన శాఖ (జీఏడీ) ఇకపై 24 గంటలు పని చేయనుంది.
రాత్రింబవళ్లు, సెలవులు అనే తేడా లేకుండా సెక్షన్ అధికారులు, సిబ్బందితో కూడిన బృందాలు పని చేయనున్నాయి. అన్ని పనిదినాల్లో ఈ బృందాలు రాత్రి 8 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 8 గంటల వరకు ప్రత్యేక షిఫ్టులో పని చేయనున్నాయి. ఇక సెలవు రోజుల్లో ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు, రాత్రి 8 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 8 గంటల వరకు రెండు ప్రత్యేక షిఫ్టుల్లో ఈ బృందాలు పనిచేస్తాయి. ఇందుకోసం 8 బ్యాచులను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ప్రతి బ్యాచ్‌లో ఇద్దరు సెక్షన్ అధికారులు, ఒక సహాయ సెక్షన్ అధికారి, ఒక ఆఫీస్ సబార్డినేట్ ఉంటారు. బీఆర్‌కేఆర్ భవన్ డీ-బ్లాక్‌లోని 9వ ఫ్లోర్‌లోని ఓ హాల్‌ను వీరికోసం కేటాయించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ డిసెంబర్ 2న ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వివిధ పనుల అమలు కోసం సీఎస్ సోమేశ్ కుమార్ రాత్రివేళ కూడా విధులు నిర్వహిస్తున్నారు. దాదాపు ప్రతి రోజూ అర్ధరాత్రి లేదా తెల్లవారుజాము వరకు సచివాలయంలోనే ఉంటున్నారు. పగటి పూట కొంత ఆలస్యంగా సచివాలయానికి వస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ప్రభుత్వ అవసరాలకు తగ్గట్టు జీఏడీ అధికారులతో పనిచేయించుకోవడానికి కొత్తగా నైట్‌షిఫ్టుల విధానాన్ని తీసుకొచ్చినట్టు సచివాలయ వర్గాలు పేర్కొంటున్నాయి.
Published date : 04 Dec 2020 04:26PM

Photo Stories