Skip to main content

సవరణల్లేకుండా ఇంగ్లిష్ మీడియం బిల్లు అసెంబ్లీ ఆమోదం

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టాలని రూపొందించిన బిల్లు (ఏపీ ఎడ్యుకేషన్ యాక్ట్ 1/1982 అమెండ్‌మెంట్ యాక్ట్ 2019)ను బుధవారం శాసనసభ ఎలాంటి సవరణలు లేకుండా ఆమోదించింది.
గత అసెంబ్లీ సమావేశాలలోనే ఈ బిల్లును శాసనసభ ఆమోదించి శాసనమండలికి పంపింది. దీనికి శాసనమండలి కొన్ని సవరణలు ప్రతిపాదిస్తూ తిరిగి అసెంబ్లీకి పంపించింది. ఈ నేపథ్యంలో ఇంగ్లిష్ మీడియం బిల్లును వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఇంగ్లిష్ మీడియంకు తాము వ్యతిరేకం కాదని అసెంబ్లీలో చెబుతూనే, టీడీపీ శాసన మండలిలో వ్యతిరేకించిందని మండిపడ్డారు. ఇది చంద్రబాబు ద్వంద్వ వైఖరికి అద్దం పడుతోందన్నారు. ఎంతో మంది నిపుణులు, ఉన్నతాధికారులు, ప్రొఫెసర్ల అభిప్రాయాలు తీసుకుని, చర్చలు జరిపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఎంతో దూరదృష్టితో ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టాలని నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. ఈ బిల్లుకు శాసన మండలి సూచించినట్టు సవరణలు చేయాల్సిన అవసరం లేదని, గతంలో అసెంబ్లీలో ఆమోదించిన బిల్లునే యథావిధిగా ఆమోదించాలని స్పీకర్‌ను కోరారు. అనంతరం ఇంగ్లీష్ మీడియంపై పలువురు సభ్యులు మాట్లాడారు.

ఆ మహిళ వినతే కదిలించి ఉంటుంది..
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజాసంకల్పయాత్ర చేస్తుండగా బాపట్లలో ఓ మహిళ ఆయనను కలిసింది. ఇంగ్లిష్ మీడియం చదువు చెబుతున్న ప్రైవేటు స్కూళ్లు ఎక్కువ ఫీజులు వసూలు చేస్తున్నాయి. ఇంత డబ్బు పేద విద్యార్థులు కట్టలేకపోతున్నారు. ఫీజులు నియంత్రించండి లేదా ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టండి.. అంటూ ఆయనకు విన్నవించింది. ఆ మహిళ ఇచ్చిన ఈ వినతి ఆయనను కదిలించి ఉంటుంది అని నా వ్యక్తిగత అభిప్రాయం.
- కోన రఘుపతి, డిప్యూటీ స్పీకర్
Published date : 23 Jan 2020 02:32PM

Photo Stories