సులభంగానే జేఈఈ మెయిన్ పేపర్– 1 పరీక్ష.. ముఖ్యంగా ఫిజిక్స్‌లో..
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: బీఈ/బీటెక్ కోర్సుల్లో ప్రవేశాల కోసం బుధవారం నిర్వహించిన జేఈఈ మెయిన్ పేపర్–1 పరీక్షలో ప్రశ్నలు గతేడాది కంటే సులభంగానే వచ్చాయని విద్యార్థులు, సబ్జెక్టు నిపుణులు చెబుతున్నారు.
ముఖ్యంగా ఎప్పుడూ కాస్త కఠినంగా వచ్చే ఫిజిక్స్ కూడా ఈసారి సులభంగానే వచ్చినట్లు తెలిపారు. దీంతో విద్యార్థులు చాలా ప్రశ్నలకు సమాధానాలు రాసినట్లు చెప్పారు. ఘర్షణ, గురుత్వాకర్షణ శక్తి, ఎలక్ట్రిసిటీ, ఎలక్ట్రానిక్స్, ఆప్టిక్స్, సెమీ కండక్టర్ పాఠ్యాంశాల నుంచి ప్రశ్నలు అడిగినట్లు సబ్జెక్టు నిపుణులు ఉమాశంకర్, ఎం.ఎన్. రావు వివరించారు. మ్యాథమెటిక్స్‌లో ప్రశ్నలు మధ్యస్థంగా ఉన్నట్లు పేర్కొన్నారు. చాలా ప్రశ్నలు ప్రాథమిక అంశాలపైనే అడిగినట్లు వెల్లడించారు. 4–5 ప్రశ్నలు మాత్రం సుదీర్ఘ ప్రశ్నలు ఇచ్చారని వెల్లడించారు. కెమిస్ట్రీ ప్రశ్నలు పూర్తిగా ఎన్సీఈఆర్‌టీ పుస్తకాల నుంచే వచ్చాయని, చాలా వరకు డైరెక్ట్ ప్రశ్నలే వచ్చాయని తెలిపారు. బయో మాలిక్యూల్స్, మెటలర్జీ, కెమికల్ బాండింగ్ నుంచి వచ్చాయని తెలిపారు. ఈసారి జనరల్ కటాఫ్ 91 పర్సెంటైల్, ఓబీసీల్లో 77 ఉండొచ్చని అంచనా వేశారు. సాధారణ విద్యార్థి కూడా మ్యాథ్స్‌లో 16 ప్రశ్నలకు, ఫిజిక్స్‌లో 17 ప్రశ్నలకు, కెమిస్ట్రీలో 20 ప్రశ్నలకు సమాధానాలు రాయగలిగేలా ఉందని వెల్లడించారు. మొదటి రోజైన బుధవారం రెండు విడతల పరీక్షలకు దేశవ్యాప్తంగా 2 లక్షల మంది హాజరైనట్లు అంచనా.
Published date : 25 Feb 2021 05:12PM