స్కూలుకు వెళ్లకముందే చిన్నారులకు చదువు
Sakshi Education
సాక్షి, అమరావతి: ప్రాథమిక విద్యకు ముందే చిన్నారులకు విద్యనందించేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
ఇందుకోసం ప్రీ స్కూల్ విద్యావిధానంపై ప్రత్యేక దృష్టి సారించింది. మూడు నుంచి ఐదేళ్లలోపు పిల్లలందరినీ అంగన్‌వాడీ ప్రీ స్కూల్స్‌లో చేర్పించి నిర్దేశించిన విధానంలో బోధన చేసేలా చర్యలు చేపట్టింది. స్థలాలు అందుబాటులో ఉన్న ప్రాథమిక పాఠశాలల్లో అంగన్‌వాడీ ప్రీ స్కూల్స్ ఏర్పాటు చేస్తోంది. వీటిపై చిన్నారుల తల్లిదండ్రులకు అవగాహన కల్పించేందుకు పెద్దఎత్తున అవగాహన, ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తోంది. అంగన్‌వాడీ నాడు–నేడు కార్యక్రమాలను తల్లిదండ్రులకు వివరించటం ద్వారా మూడు నుంచి ఐదేళ్లలోపు చిన్నారులను అంగన్‌వాడీ ప్రీ స్కూల్స్‌లో చేర్పించేలా కార్యక్రమాలకు రూపకల్పన చేసింది.
అవగాహన కార్యక్రమాలు ప్రారంభం :
ప్రచారంలో ముఖ్యాంశాలు..
ప్రతి ప్రీ స్కూల్‌కు 5 సెంట్ల స్థలం :
అవగాహన కార్యక్రమాలు ప్రారంభం :
- ప్రీ స్కూల్ విద్యావిధానంపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించిన రాష్ట్ర ప్రభుత్వం ఐదేళ్లలోపు చిన్నారులను పెద్దఎత్తున వీటిలో చేర్పించే బాధ్యతను మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖకు అప్పగించింది.
- ప్రభుత్వ ఆదేశాలతో అంగన్‌వాడీ టీచర్లు, సూపర్‌వైజర్లు, కార్యకర్తలతో గ్రామ గ్రామాన అవగాహన కార్యక్రమాలు ప్రారంభించారు. వారు తమ కేంద్రాల పరిధిలోని చిన్నారులను గుర్తించి, వారి తల్లిదండ్రులకు ప్రీ స్కూల్ విద్య ఆవశ్యకతను వివరిస్తున్నారు. అవగాహన, ప్రచార కార్యక్రమాలు వచ్చేనెల 2వ తేదీ వరకు కొనసాగుతాయి.
ప్రచారంలో ముఖ్యాంశాలు..
- ప్రీ స్కూల్‌లో చేరిన ప్రతి చిన్నారికి పుస్తకాలు, ప్రీ స్కూల్ కిట్స్, కలర్ కార్డులు, పోస్టర్లు, చార్టులు, అభ్యసన సామగ్రి (లెర్నింగ్ కిట్స్), బొమ్మలు అందజేసి, చక్కటి వాతావరణంలో ప్రాథమిక విద్య బోధించేలా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. చిన్నారులకు పాఠ్యాంశాలు సులభంగా అర్థమయ్యేలా ప్రభుత్వం కొత్త సిలబస్ రూపొందించింది.
- మంచి పోషకాహారం ఇచ్చేందుకు ప్రభుత్వం నిధులు కేటాయించింది. వచ్చేనెల 1 నుంచి వైఎస్సార్ సంపూర్ణ పోషణ పథకం కింద చిన్నారులకు అదనంగా కోడిగుడ్లు, పాలు తదితరాలను అందజేస్తారు. పిల్లలకు ఇచ్చే పాలు, గుడ్లు నిల్వ చేసేందుకు అంగన్‌వాడీల్లో రిఫ్రిజిరేటర్లు ఏర్పాటు కానున్నాయి.
ప్రతి ప్రీ స్కూల్‌కు 5 సెంట్ల స్థలం :
- స్థలం అందుబాటులో ఉన్న ప్రతి ప్రాథమిక పాఠశాల ఆవరణలో అంగన్‌వాడీ ప్రీ స్కూల్ భవనాల నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది.
- ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల ప్రాంగణాల్లో 5 సెంట్ల చొప్పున స్థలాన్ని వీటికి కేటాయించేలా చర్యలు చేపట్టాలని విద్యా శాఖ కమిషనర్ వాడ్రేవు చిన వీరభద్రుడు డీఈవోలను ఆదేశించారు.
- ఈ విద్యా సంవత్సరంలోనే ఆ స్థలాల్లో నిర్మాణాలు పూర్తి చేసి.. వచ్చే విద్యా సంవత్సరానికి అందుబాటులోకి తీసుకు రావాలని ప్రభుత్వం సంకల్పించింది.
- మరోవైపు నాడు–నేడు కార్యక్రమంలో భాగంగా రూ.4 వేల కోట్లతో అంగన్‌వాడీ సెంటర్ల రూపురేఖలు మార్చేలా చర్యలు చేపట్టింది.
- ప్రభుత్వ పాఠశాలల్లో సదుపాయాలు కల్పిస్తున్న విధంగానే అంగన్‌వాడీల్లోనూ పరిశుభ్రమైన నీరు, నిరంతర నీటి సరఫరాతో కూడిన బాత్‌రూమ్‌ల నిర్మాణం చేపట్టనుంది. ప్రతి అంగన్‌వాడీ సెంటర్‌లో ఫర్నీచర్, ఫ్యాన్లు ఉండేలా ఏర్పాట్లు చేయనుంది.
Published date : 28 Aug 2020 08:14PM