సీఎం ఆదేశాలతో..విరాళం ఇచ్చిన యువతికి ఉద్యోగం
Sakshi Education
సేలం: కరోనా నివారణ నిధి కోసం తన మెడలో ఉన్న రెండు సవర్ల చైన్‌ను తాకట్టు పెట్టి విరాళంగా ఇచ్చిన యువతికి ఓ ప్రైవేటు సంస్థలో ఉద్యోగం లభించింది.
సీఎం ఎంకే స్టాలిన్ ఆదేశాలతో ఆమెకు ఉద్యోగం వచ్చినట్లు వెలుగు చూసింది. నామక్కల్‌కు చెందిన సౌమ్య కంప్యూటర్ ఇంజనీరింగ్ పూర్తి చేసి ఉద్యోగ ప్రయత్నాల్లో ఉంది. ఈ క్రమంలో ఈనెల 12న మేట్టూరుకు సీఎం స్టాలిన్ రావడంతో ఆయన్ను కలిసేందుకు ప్రయత్నించారు. తన మెడలోని రెండు సవర్ల చైన్‌ను తాకట్టు పెట్టి సీఎం కరోనా నివారణ నిధికి అందజేశారు. తనకు ఓ ఉద్యోగం ఇప్పించాలని విన్నవించారు.
ఇంజినీర్ ఉద్యోగం..
ఆమెలోని మానవత్వాన్ని మెచ్చిన సీఎం ఆ చైన్‌ను విడిపించడమే కాకుండా, ఆమెకు ఉద్యోగం వచ్చేలా చేయాలని ఆదేశించారు. ఆ మేరకు ఓ ప్రైవేటు సంస్థలో రూ. 17 వేల జీతంతో సౌమ్యకు కంప్యూటర్ ఇంజినీర్ ఉద్యోగం దక్కింది. నియామక పత్రాన్ని విద్యుత్‌శాఖ మంత్రి సెంథిల్ బాలాజీ మంగళవారం ఆమెకు అందజేశారు. అలాగే ఫోన్లో సీఎంతో మాట్లాడించారు. దీంతో ఆమె ఆనందానికి అవదులు లేకుండా పోయింది.
Published date : 16 Jun 2021 08:03PM