ఫీజురీయింబర్స్‌మెంటు పొందాలంటే.. 75 శాతం హాజరు తప్పనిసరి!
Sakshi Education
సాక్షి, అమరావతి: బీటెక్, బీ ఫార్మసీ కోర్సులకు సంబంధించి సెకండియర్ లేటరల్ ఎంట్రీలో ప్రవేశాలు పొందుతున్న విద్యార్థులకు బయోమెట్రిక్ తప్పనిసరి చేస్తూ సాంకేతిక విద్యా శాఖ ఆదేశాలిచ్చింది.
అర్హత గల విద్యార్థులు ఫీజు రీయింబర్స్‌మెంటు పొందాలంటే 75 శాతం హాజరు తప్పనిసరని స్పష్టం చేసింది. ఈ మేరకు అన్ని యూనివర్సిటీల రిజిస్ట్రార్లకు సాంకేతిక విద్యా శాఖ కమిషనర్ ఎం.ఎం.నాయక్ లేఖ రాశారు. బీటెక్, బీ ఫార్మసీ కోర్సుల్లో నేరుగా సెకండియర్‌లోకి డిప్లొమా, బీఎస్సీ విద్యార్థులకు లేటరల్ ఎంట్రీ కల్పిస్తుంటారు. అయితే కొన్ని ప్రైవేటు కాలేజీలు ప్రవేశాల అనంతరం నిబంధనలు అమలు చేయడం లేదు. విద్యార్థులు కాలేజీలకు రాకపోయినా, కనీస హాజరు శాతం లేకపోయినా పట్టించుకోవట్లేదు. ఈ నేపథ్యంలో ప్రైవేటు కాలేజీల్లో విద్యార్థులకు బయోమెట్రిక్ హాజరు తప్పనిసరి చేస్తున్నట్లు కమిషనర్ పేర్కొన్నారు. రిజిస్ట్రార్లు తమ పరిధిలోని కాలేజీల్లో ఈ హాజరు నిబంధన పక్కాగా అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
Published date : 26 Nov 2020 01:28PM