ప్రతి మనిషి... ఉన్నతంగా జీవించాలి!!
Sakshi Education
జీవితం ఉన్నతంగా ఉండాలి. ఉన్నతంగా జీవించాలి. సమాజానికి ఆదర్శాన్ని అందించాలి. తిన్నామా పడుకున్నామా తెల్లారిందా అని అనుకుంటే అందువల్ల ఎటు వంటి ప్రయోజనమూ లేదు.
ఈ మూడు పనులను జంతువుల సహా మిగతా ప్రాణులు కూడా చేస్తున్నాయి. అవి కూడా పిల్లలను కంటున్నాయి. పెంచుతున్నాయి. అయితే వాటికి, మనకి మధ్య ఏదో ఒక తేడా ఉండాలి. వాటిలాగే మనం కూడా జీవిస్తే ఈ జీవితానికి అర్థం, పరమార్థం ఏమీలేనట్టే కదా. దేహాన్ని పెంచిపోషించడానికే పరి మితం కాకూడదు. నిజాయితీని కాపాడుకోవాలి. నీతిని కాపాడుకోవాలి. ప్రేమతత్వాన్ని అభివృద్ధి చేసుకోవాలి. ప్రేమే జీవితంగా బతకాలి. ప్రేమతో రోజును ప్రారంభించు. ప్రేమతో రోజంతా గడుపు. ప్రేమతోనే ఆ రోజును ముగించు. భగవంతుడిని దర్శించుకోవడానికి లేదా భగవంతుడిని చేరుకోవడానికి ఇదొక్కటే రాచమార్గం. ఈ ప్రకృతి అంతా దైవస్వరూపమే. దైవప్రతిబింబమే. ఇందులో దివ్యత్వం నిండి ఉంది. దివ్యత్వం లేనిచోటే లేదు. ప్రతి మనిషి దైవస్వరూపమే. అందువల్ల సర్వజీవ నమస్కారం కేశవం ప్రతిగచ్ఛతి అని ఉపనిషత్తులు ఉద్బోధిస్తు న్నాయి. మనం ఎవరికి నమస్కారం పెట్టినా ఆ దేవుడికి నమస్కారం పెట్టినట్టే. మనం ఏ జీవిని బాధ పెట్టినా ఆ దేవుడిని బాధ పెట్టినట్టే. ఈ ఒక్క విషయం ప్రతి ఒక్కరి మనస్సులో నాటుకుపోవాలి. అప్పుడే మనం ప్రతి ఒక్కరినీ ప్రేమించగలుగుతాం. ప్రతి ఒక్కరూ ప్రేమస్వరూపులుగా మారిపోయి ప్రపంచానికి శాంతిమయం చేయాలి. ఇక ఉన్నతంగా జీవించడమంటే ఆలోచనలు, ఆచరణ, మాట తీరు ఉన్నతంగా మాట్లాడడమే. ఇతరులకు ఆదర్శాన్ని అందించేవిగా ఉండడమే. అలా ఉండగలిగితే మానవ జీవితానికి ధన్యత లభించినట్టే. ప్రతి ఒక్కరి హృదయంలో దైవం కొలువై ఉంటాడు. అందుకే దేహమేరా దేవాలయం అనే నానుడి వచ్చింది. కనుక ప్రతి ఒక్కరూ తమ జీవితంలో కొంత సమయాన్ని సమాజ సేవకు వినియోగించాలి.
Published date : 18 Jan 2020 02:00PM