Skip to main content

ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలకు కార్పొరేట్ హంగులు

సిరిసిల్ల: పట్టణంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలను ఆధునిక హంగులతో తీర్చిదిద్దారు.
మంత్రి కేటీఆర్ చొరవతో బడి రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. శిథిలావస్థకు చేరిన ఈ పాఠశాలను చూసి చలించిపోయిన కేటీఆర్.. కార్పొరేట్ సోషల్ రెస్పాన్‌సబులిటీ (సీఎస్‌ఆర్) ద్వారా సర్కారు బడి రూపురేఖలు మార్చేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. గివ్ తెలంగాణ సంస్థ మేనేజింగ్ డెరైక్టర్ కొండూరి సంకేత్‌తో చర్చించారు. సీఎస్‌ఆర్ ద్వారా రూ.3 కోట్లు వెచ్చించి ఆధునిక హంగులు కల్పించేందుకు పనులకు శ్రీకారం చుట్టారు. ఆర్నెల్లలో పనులు తుదిదశకు చేరాయి. పచ్చదనంతో పాఠశాల ఆవరణ, 38 తరగతి గదులతో రెండు అంతస్తుల్లో పాఠశాల భవనాన్ని తీర్చిదిద్దారు. ఇందులో లైబ్రరీ, సైన్‌స ల్యాబ్, 32 కంప్యూటర్లతో కంప్యూటర్ ల్యాబ్, ఇంటర్నెట్ సౌకర్యం, 400 మంది బాలికలు కూర్చుని భోజనం చేసే డైనింగ్ హాలు, ఆధునిక టాయిలెట్స్, 12 సీసీ కెమెరాలు, 350 డెస్క్‌లు, పాఠశాల ఆవరణలో ఫుట్‌బాల్, వాలీబాల్ కోర్టులు ఏర్పాటు చేశారు.

1000 మంది విద్యార్థులకు వసతి
సర్కారు బడి అంటే సహజంగానే అరకొర వసతులు.. అసౌకర్యాలు కనిపిస్తాయి. కానీ రాజన్న సిరిసిల్ల జిల్లా బాలికల హైస్కూల్‌లో ఇప్పుడు కళ్లు చెదిరే వసతులు దరిచేరాయి. సుమారు వెరుు్య మంది విద్యార్థినులు ఉండేలా ఆధునిక హంగులు కల్పించారు. ప్రస్తుతం ఆ బడిలో 575 మంది చదువుకుంటున్నారు. కలెక్టర్ కృష్ణభాస్కర్, గివ్ తెలంగాణ సంస్థ ఎండీ సంకేత్ ఇటీవల ఆ పాఠశాలను సందర్శించారు. ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి 9వ, పదో తరగతులు ప్రారంభిస్తున్న నేపథ్యంలో బడి పరిసరాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. కార్పొరేట్ స్కూల్‌కు దీటుగా ఆధునిక వసతులు ఉన్నాయని కలెక్టర్ కితాబిచ్చారు. ఆ పాఠశాల గతాన్ని చూసిన, తెలిసిన వారంతా ఇప్పుడు కొత్తగా కనిపిస్తున్న బడిని చూసి ఆశ్చర్యపోతున్నారు. సకల సౌకర్యాలతో సర్కారు బడిలో సమూల మార్పులు రావడంపై పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు భాగ్యరేఖ సంతోషం వ్యక్తం చేశారు. మంత్రి కేటీఆర్ సైతం బడిని చూసి మంత్రముగ్ధుడయ్యారు. రాష్ట్రానికే సిరిసిల్ల సర్కారు బడి మోడల్‌గా నిలుస్తుందని కితాబిచ్చారు.
Published date : 27 Jan 2021 05:16PM

Photo Stories