ప్రైవేట్ యూనివర్సిటీలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో వివిధ సంస్థలు ప్రైవేటు యూనివర్సిటీలను ఏర్పాటు చేసేందుకు సూత్రప్రాయంగా అంగీకరిస్తూ ప్రభుత్వం లెటర్ ఆఫ్ ఇంటెంట్ (ఎల్‌వోఐ)ను ఫిబ్రవరి 14 (శుక్రవారం)నజారీ చేసింది.
ఇందులో మొదట మల్లారెడ్డి మహిళా విశ్వ విద్యాలయాన్ని మైసమ్మగూడలో ఏర్పాటు చేసేందుకు ఓకే చెబుతూ ఎల్‌వోఐ జారీ చేసింది. ఈ మేరకు మల్లారెడ్డి విద్యా సంస్థల కార్యదర్శి సీహెచ్ మహేందర్‌రెడ్డికి ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రా రామచంద్రన్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఎల్‌వోఐ ఆధారంగా ఆ విద్యా సంస్థ యూనివర్సిటీ ఏర్పాటుకు అవసరమైన చర్యలు చేపట్టాల్సి ఉంటుంది. రూ.10 కోట్ల కార్పస్ ఫండ్, మూడేళ్ల పాటు ఉండేలా రూ.30 కోట్ల ఫిక్స్‌డ్ డిపాజిట్, ప్రాజెక్టు విలువలో 1 శాతం ఎండోమెంట్ ఫండ్ లేదా రూ.10 కోట్లు వెచ్చించడంతోపాటు తగిన భవనాలు, వాటిల్లో సదుపాయాల కల్పన వంటి ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది. ఆరు నెలల్లోగా అవి పూర్తి చేశాక ప్రభుత్వం లెటర్ ఆఫ్ అప్రూవల్‌ను జారీ చేయనుంది. మల్లారెడ్డి మహిళా యూనివర్సిటీతోపాటు టెక్ మహీంద్రా యూనివర్సిటీ ఏర్పాటుకు కూడా ఎల్‌వోఐ ఇచ్చింది. వచ్చే వారం రోజుల్లోగా మిగతా 7 సంస్థలకు ఎల్‌వోఐ జారీ చేసే అవకాశం ఉంది. అందులో అనురాగ్, గురునానక్ , శ్రీనిధి, ఎంఎన్‌ఆర్, నిప్‌మర్, వోక్సన్, ఎస్‌ఆర్ విద్యాసంస్థలున్నాయి. రాష్ట్రంలో ప్రైవేటు యూనివర్సిటీల ఏర్పాటు కోసం చట్టం చేసిన ప్రభుత్వం గతేడాది ఆగస్టులో దీనికి సంబంధించి మార్గదర్శకాలను జారీ చేసింది. అనంతరం దరఖాస్తులను ఆహ్వానించగా 13 సంస్థలు దరఖాస్తు చేసుకున్నాయి. అయితే నిపుణుల కమిటీ తనిఖీలు చేసి 9 సంస్థలకు ఎల్‌వోఐ ఇచ్చేందుకు సిఫారసు చేశాయి. మరో రెండు సంస్థలైన ర్యాడిక్లిప్, అమిటీ సంస్థలకు భూమి సమస్య తలెత్తడంతో వాటికి ప్రభుత్వం ఎల్‌వోఐ ఇచ్చే అవకాశం లేదు. కాగా రాష్ట్రంలో ఏర్పాటయ్యే ప్రైవేటు యూనివర్సిటీల్లో 25 శాతం సీట్లను రాష్ట్రంలోని స్థానిక విద్యార్థులకు ఇవ్వాల్సి ఉంటుంది.
Published date : 15 Feb 2020 02:28PM