Skip to main content

ఆ పిల్లల చదువు ఆగరాదు.. పాఠశాల యాజమాన్యాలతో మాట్లాడండి..

సాక్షి, న్యూఢిల్లీ : కరోనా మహమ్మారి కారణంగా తల్లిదండ్రులు లేదా వారిలో ఒకరిని కోల్పోయిన చిన్నారుల చదువు మధ్యలో ఆగరాదని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది.
ఈ ఏడాది వారి చదువు కొనసాగేలా చర్యలు తీసుకోవాలని అన్ని రాష్ట్రాలకు సూచించింది. ఆయా చిన్నారుల విద్యా రుసుములు మాఫీ చేసేందుకు ప్రైవేటు యాజమాన్యాలను కోరాలని, లేదంటే సగం ఖర్చును ప్రభుత్వాలు భరించాలని సూచించింది. చిన్నారుల రక్షణ నిలయాల్లో (చైల్డ్‌ హోమ్‌లు) కరోనా వ్యాప్తి సుమోటో కేసును గురువారం జస్టిస్‌ ఎల్‌. నాగేశ్వరరావు, జస్టిస్‌ అనిరుద్ధ బోస్‌లతో కూడిన ధర్మాసనం విచారించింది. మార్చి 2020 నుంచి అనాథలైన లేదా తల్లిదండ్రుల్లో ఒకరిని కోల్పోయిన చిన్నారుల విద్యా భద్రతపట్ల రాష్ట్ర ప్రభుత్వాలు హామీ ఇవ్వాలని పేర్కొంది. కనీసం ప్రస్తుత విద్యా సంవత్సరమైనా ఆయా చిన్నారుల చదువు కొనసాగేలా చూడాలని కోరింది. ‘ఈ విద్యా సంవత్సరంలో ఆయా చిన్నారుల విద్యకు ఆటంకం రాకుండా ఉండేందుకు వారు చదువుతున్న ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలతో మాట్లాడడానికి బాలల సంక్షేమ కమిటీలు, జిల్లా విద్యాశాఖాధికారులతో సమన్వయం చేసుకోవాలి’.. అని అన్ని రాష్ట్రాలకు ధర్మాసనం ఆదేశాలిచ్చింది. ఈ విషయంలో రాష్ట్రాలు ప్రత్యేక చొరవ చూపాలని తెలిపింది. ఈ సందర్భంగా అమికస్‌ క్యూరీ గౌరవ్‌ అగర్వాల్‌ ఇచ్చిన నివేదిక ఆధారంగా రాష్ట్రాలకు సుప్రీంకోర్టు పలు సూచనలు చేసింది.

ఏపీ రూ.10 లక్షల పరిహారం ఇస్తోంది
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కారణంగా 326 మంది చిన్నారులు తమ తల్లిదండ్రులను కోల్పోగా 711 మంది పిల్లలు తమ తల్లిదండ్రుల్లో ఒకరిని కోల్పోయారని గౌరవ్‌ అగర్వాల్‌ తెలిపారు. ఆయా చిన్నారుల్లో ఎంతమందిని సంప్రదించారన్న విషయాలు రాష్ట్రం తెలుపలేదన్నారు. ఈ అంశం త్వరగా పూర్తిచేయాలని, 326 మందిలో సుమారు 240 మంది లబ్ధిపొందుతారని, 711 మందిలో 434 లబ్ధిపొందుతారని తెలిపారు. మిగిలిన చిన్నారులపై చైల్డ్‌ వెల్ఫేర్‌ కమిటీ (సీడబ్ల్యూసీ)లు విచారణ పూర్తిచేయాల్సి ఉందన్నారు. కోవిడ్‌ కాకుండా ఇతర కారణాలవల్ల చిన్నారులు తల్లిదండ్రులను కోల్పోయినట్లయితే నివేదికల ఆధారంగా కమిటీ వారిపై నిర్ణయం తీసుకుంటుందని ఏపీ ప్రభుత్వం తరఫు న్యాయవాది మెహ్‌ఫజ్‌ నజ్కీ తెలిపారు. అలాగే, ‘ఆంధ్రప్రదేశ్‌లో 326 మంది చిన్నారులు తల్లిదండ్రులను కోల్పోయినట్లు గుర్తించారు. మార్చి 2020 నుంచి వేరే ఇతర కారణాలతో కూడా కలిపి తల్లిదండ్రుల్లో ఒకరిని కోల్పోయిన వారు 7,010 మంది ఉన్నారు. వీరిలో 5,690 మంది చిన్నారులను సీడబ్ల్యూసీకి అప్పగించారు. కరోనావల్ల అనాథలైన చిన్నారులకు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం రూ.10 లక్షల పరిహారం ప్రకటించింది. వీరిలో 190 మందికి మంజూరు చేసింది. సప్లిమెంటరీ మద్దతుగా చిన్నారులకు నెలకు రూ.500 రాష్ట్ర ప్రభుత్వం ఇస్తోంది. ఇలా 4,342 మంది లబ్ధిపొందారు. మరోవైపు.. 2,153 మంది ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్నట్లు గుర్తించారు. ఈ నేపథ్యంలో.. చిన్నారుల విద్య ఆగిపోకుండా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి’.. అని అమికస్‌ క్యూరీ సూచించారు. దీంతో.. జస్టిస్‌ లావు నాగేశ్వరరావు స్పందిస్తూ.. ‘సీడబ్ల్యూసీ విచారణలు కాలపరిమితితో పూర్తిచేయాలి. 326 మంది అనాథలు, 7,010 మంది చిన్నారులకు సంబంధించిన పూర్తి వివరాలను జిల్లా మేజిస్ట్రేట్లు వెంటనే అప్‌లోడ్‌ చేయాలని ఆదేశిస్తున్నాం. చిన్నారులకు అన్ని విధాలా మద్దతివ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశిస్తున్నాం’.. అని తెలిపారు.
Published date : 27 Aug 2021 05:33PM

Photo Stories