పీఈటీ పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్: హైకోర్టు
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా గురుకుల పాఠశాలల్లో పీఈటీ పోస్టుల భర్తీకి హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్స్ ఎడ్యుకేషన్ (ఎన్సీటీఈ) మార్గదర్శకాల ప్రకారం 1 నుంచి 8వ తరగతి వరకు ఒక కేటగిరీ, 9, 10 తరగతులకు మరో కేటగిరీగా పీఈటీ పోస్టులను భర్తీ చేయాలని పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ)ని హైకోర్టు ఆదేశించింది. ఈమేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమాకోహ్లి, జస్టిస్ బి.విజయసేన్ రెడ్డిలతో కూడిన ధర్మాసనం సోమ వారం తీర్పునిచ్చింది. పీఈటీ పోస్టులు భర్తీ చేయాలంటూ ఎన్సీటీఈ ఇచ్చిన ఆదేశాల మేరకు 616 పోస్టులను భర్తీ చేసేందుకు టీఎస్‌పీఎస్సీ 2017లో నోటిఫికేషన్ జారీచేసింది. అయితే 1–8వ తరగతి కేటగిరీలో ఉండే పీఈటీ పోస్టులకు ఇంటర్, డిప్లొమా అర్హతలుగా ఉంటే సరిపోతుంది. 9–10 తరగతుల కేటగిరీ పోస్టులకు డిగ్రీతోపాటు పీఈటీ విభాగంలో డిగ్రీ ఉండాలి. అయితే ఈ రెండు కేటగిరీలను కలిపి ఒకే నోటిఫికేషన్ ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ డిప్లొమా అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ ను పరిశీలించిన సింగిల్ జడ్జి రెండు కేటగిరీలుగా వేర్వేరు నోటిఫికేష న్లు ఇవ్వాలని, ఎన్సీటీఈ నిబంధనల మేరకు పోస్టులు భర్తీ చేయాలంటూ 2019 సెప్టెంబర్‌లో తీర్పునిచ్చారు. దీన్ని సవాలుచేస్తూ ఒకే నోటిఫికేషన్ ఇచ్చే అధికారం తమకు ఉందంటూ రాష్ట్రప్రభుత్వం ధర్మాసనం ముందు అప్పీల్ దాఖలుచేసింది. కానీ ధర్మాసనం ఈ వాదనను తోసిపుచ్చింది.
Published date : 09 Mar 2021 04:42PM