Skip to main content

పౌష్టికాహారాన్ని సక్రమంగా అందించేందుకు ఈ–పోస్‌...

సాక్షి ప్రతినిధి, అనంతపురం: గర్భిణులు, బాలింతలు, పిల్లలకు పౌష్టికాహారాన్ని సక్రమంగా అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది.
ఇందుకోసం రేషన్‌ పంపిణీ తరహాలో ఈ–పోస్‌ ద్వారా అందించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం అంగన్‌ వాడీల ద్వారా గర్భిణులు, బాలింతలు, పిల్లలకు గుడ్లు, పాలు, వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ కిట్లను సరఫరా చేస్తున్నారు. అయితే, ఈ ప్రక్రియలో కాంట్రాక్టర్లతో పాటు ఐసీడీఎస్‌ సిబ్బంది చేతివాటం ప్రదర్శించి అసలైన లబ్ధిదారులకు సక్రమంగా అందించడంలేదనే విమర్శలున్నాయి. దీంతో ప్రభుత్వం ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. అంతేకాక.. గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలును పర్యవేక్షించేందుకు సోషల్‌ ఆడిట్‌ ప్రక్రియ జరుగుతుంది. ఈ సోషల్‌ ఆడిట్‌ను మొదటిసారిగా ఐసీడీఎస్‌ ప్రాజెక్టుల్లో కూడా చేపట్టాలని సీఎం వైఎస్‌ జగన్‌ ఆదేశించారు. అయితే, దీనిని కూడా సక్రమంగా అమలుచేయడంలేదు. ఈ నేపథ్యంలో.. సోషల్‌ ఆడిట్‌ను ఇక నుంచి పక్కాగా అమలుచేయాలని ప్రభుత్వం స్పష్టంగా నిర్దేశించినట్లు తెలుస్తోంది.

అక్రమాలు జరుగుతున్నాయిలా..
గతంలో గర్భిణులు, బాలింతలకు ప్రతీనెలా 16 గుడ్లను సరఫరా చేసేవారు. మూడేళ్లల్లోపు పిల్లలకు ఎనిమిది గుడ్లను మాత్రమే ఇచ్చేవారు. అయితే, సీఎంగా వైఎస్‌ జగన్‌ వచ్చిన తర్వాత.. పిల్లల ఆరోగ్యం మెరుగుపర్చడంతో పాటు రక్తహీనత సమస్యను అధిగమించాలనే ఉద్దేశంతో అందరికీ ప్రతీనెలా 25 గుడ్లను సరఫరా చేయాలని ఆదేశించారు. అది కూడా ఒకేసారి ఇస్తే పాడైపోతాయనే ఉద్దేశంతో మూడు విడతలుగా సరఫరా చేస్తున్నారు. 1–10వ తేదీ, 11–20, 21 నుంచి నెలాఖరులోగా మూడు విడతలుగా వారికి అందించాలి. అయితే, అంతకు మూడ్రోజుల ముందే సదరు కాంట్రాక్టర్లు అంగన్‌ వాడీ కేంద్రాలకు గుడ్ను చేరవేయాలి. ఒకవేళ ఈ విధంగా చేర్చకపోతే పెనాల్టీ విధించే అవకాశం ఉంటుంది. అంతేకాక.. మొదటి విడతలో గుడ్డుపై పసుపు రంగు, రెండో విడతలో సరఫరా చేసే గుడ్లపై నీలి రంగు, మూడో విడతలోని గుడ్లపై ఆకుపచ్చ రంగు వేయాల్సి ఉంటుంది. వాస్తవంలో ఇటువంటిది ఏదీ జరగడంలేదు. అలాగే, సరఫరా చేయాల్సిన గుడ్ల కంటే తక్కువగా సరఫరా చేస్తున్నారు. సదరు కాంట్రాక్టర్లు సరఫరా చేసే గుడ్ల పరిమాణం కూడా తక్కువగా ఉంటున్నాయనే ఆరోపణలున్నాయి. అన్నింటికీ మించి, ఒకేసారి సరఫరా చేసి మూడు విడతల్లో సరఫరా చేసినట్లుగా చూపి రవాణా చార్జీలను మిగుల్చుకుంటున్నారు. ఇక గుడ్లతో పాటు బాలింతలు, గర్భిణులకు ప్రతీనెలా ఐదు లీటర్ల చొప్పున పాలను ప్రభుత్వం అందిస్తోంది. పిల్లలకు 2.5 లీటర్ల పాలను సరఫరా చేస్తోంది. ఒక్కో లీటరు పాలను సగటున రూ.47 నుంచి రూ.48 మేర చెల్లించి ప్రభుత్వం అందిస్తోంది. అలాగే, కిట్టుకు రూ.250 చొప్పున చెల్లించి వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ కిట్లనూ ప్రభుత్వం అందిస్తోంది. రాగిపిండి, చిక్కీలు, ఖర్జూరాలు వంటి పౌష్టికాహారాన్ని కిట్టు రూపంలో ప్రభుత్వం ప్రతీనెలా ఇస్తోంది. అయితే, వీటి సరఫరాలో కూడా అక్రమాలు జరుగుతున్నట్లు ప్రభుత్వం గుర్తించింది. ఈ నేపథ్యంలో.. అక్రమాలను అరికట్టేందుకు రేషన్‌ బియ్యం తరహాలో ఈ–పోస్‌ ద్వారా గుడ్లు, పాలతో పాటు వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ కిట్లను అందించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది.
Published date : 03 Apr 2021 06:19PM

Photo Stories