Skip to main content

పాఠశాలల్లో ప్రత్యక్ష బోధనకు విద్యాశాఖ పక్కా ప్రణాళికతో చర్యలు!

సాక్షి, హైదరాబాద్: సుదీర్ఘ విరామం తర్వాత విద్యా సంస్థలను పునఃప్రారంభించేందుకు ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో విద్యాశాఖ పక్కా ప్రణాళికతో చర్యలు చేపడుతోంది.
ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి తొమ్మిదో తరగతి నుంచి పైతరగతులన్నీ ప్రారంభం కానున్నాయి. ఇప్పటివరకు ఆన్‌లైన్ తరగతులతో బోధన కార్యక్రమాన్ని సాగించిన విద్యాసంస్థల యాజమాన్యాలు ఇక ప్రత్యక్ష తరగతులకు సన్నద్ధమవుతున్నాయి. కోవిడ్ జాగ్రత్తలు పాటిస్తూ తరగతులు నిర్వహించాలని ఆదేశించిన ప్రభుత్వం.. అందుకు సంబంధించి కేటగిరీల వారీగా మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈక్రమంలో ప్రభుత్వ విద్యా సంస్థలకు సంబంధించి ప్రత్యేక ఫార్మాట్‌ను రూపొందించింది. దీనికి అనుగుణంగా తీసుకుంటున్న చర్యలకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత విభాగాలు సేకరిస్తున్నాయి.

15 అంశాలతో సిద్ధంగా..
పాఠశాలలు, గురుకుల విద్యాలయాలు, ఆదర్శ పాఠశాలలు, కస్తూర్భా గాంధీ బాలికల విద్యాలయాలు, ఆశ్రమ పాఠశాలలు కేవలం పాక్షికంగా ప్రారంభమవుతాయి. ఈ విద్యా సంస్థల్లో కేవలం 9, 10వ తరగతి పిల్లల హాజరుకు మాత్రమే ప్రభుత్వం అనుమతించింది. ఇక జూనియర్, డిగ్రీ, పీజీ కాలేజీల్లో పూర్తి విద్యార్థులకు అనుమతి ఇచ్చినప్పటికీ.. జాగ్రత్త చర్యలు, వసతుల ఆధారంగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లకు అవకాశం కల్పించనుంది. అయితే ఇందుకు ప్రభుత్వ అనుమతి తప్పనిసరి. అలాగే స్టాఫ్ రూమ్స్, తరగతి గదులు, కిచెన్ షెడ్, తాగునీటి, మురుగునీటి సరఫరా వ్యవస్థ, కరెంటు సౌకర్యం, టాయిలెట్లు, ఫర్నిచర్, వంట సామగ్రి శుభ్రతకు సంబంధించిన సమాచారంపై స్పష్టత ఇవ్వాలి. మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించి బియ్యం ఆవశ్యకత, విద్యార్థుల తల్లిదండ్రుల ఫోన్ నంబర్ల జాబితా సిద్ధం చేసుకోవాలి. విద్యా సంస్థ శానిటైజేషన్ కోసం గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీకి లేఖల సమర్పణ, శానిటైజర్లు, మాస్కుల సంసిద్ధత తదితర అంశాలపై పూర్తి సమాచారాన్ని సమర్పించాలి. కంటైన్మెంట్ జోన్లలో ఉన్న విద్యా సంస్థల పునఃప్రారంభంపై ప్రభుత్వమే నిర్ణయం తీసుకుంటుంది. కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా వీటిని తెరిచేందుకు అనుమతిచ్చిన ప్రభుత్వం.. స్థానిక పరిస్థితులు, జాగ్రత్త చర్యల అమలు ఆధారంగా పాఠశాల నిర్వహణలో ఇబ్బందులు ఎదురైతే జిల్లా కలెక్టర్‌కు పరిస్థితిని నివేదించి ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలి.
Published date : 25 Jan 2021 07:49PM

Photo Stories