Skip to main content

ఒకరోజు బ్రిటిష్‌ హై కమిషనర్‌గా చైతన్య...చాలా పనులు చక్కబెట్టిందిలా..

ఆడపిల్ల పుట్టింది. హర్‌ ఎక్సెలెన్సీ!! ఆకాశం పూలను వర్షించింది.
మేఘాలు పల్లకీలయ్యాయి. లెఫ్ట్‌ రైట్‌.. లెఫ్ట్‌ రైట్‌.. దేశాల గౌరవ వందనం. ఎంబసీలకు విద్యుద్దీపాలు. గర్ల్‌ చైల్డ్‌.. సంతోషాల రాయబారి. స్నేహాల హై కమిషనర్‌.

గోరు ముద్దల్లో కలిపి పెట్టేవి కావు జీవిత లక్ష్యాలు. పిల్లల్ని వీలైనన్ని కొత్త ప్రదేశాలకు తిప్పాలి. మనమేమీ చెయ్యి పట్టుకుని ప్రపంచ దేశాలు తిప్పక్కరలేదు. ప్రపంచంలో ఇలాంటివి ఉన్నాయని చెప్పి వదిలేస్తే వాళ్లే తెలుసుకుంటారు. అప్పుడే లక్ష్యాలను ఏర్పరచుకుంటారు. చైతన్య ఢిల్లీ విద్యార్థిని. పద్దెనిమిదేళ్లు. ఈ మధ్యే కాలేజ్‌ చదువు పూర్తయింది. స్కాలర్‌షిప్‌తో అమెరికన్‌ యూనివర్సిటీలో (పేరే 'అమెరికన్‌ యూనివర్సిటీ', వాషింగ్టన్‌లో ఉంది) ఇక్కడి నుంచే డిగ్రీలో చేరింది. ''ఇంటర్నేషనల్‌ స్టడీస్‌ అండ్‌ ఎకనమిక్స్‌; సర్టిఫికెట్‌ ప్రోగ్సామ్స్‌ ఇన్‌ అడ్వాన్స్‌డ్‌ లీడర్‌షిప్‌ స్టడీస్‌; పొలిటికల్‌ థాట్‌'' అనే ఐదారు సబ్జెక్టులు కలిసిన డిగ్రీ. చిన్నప్పుడు వాళ్ల ఇంటి దగ్గరలో బ్రిటిష్‌ లైబ్రరీ ఉండేది. ఒకసారి ఆమె తండ్రి ఆ లైబ్రరీకి తీసుకెళ్లాడు. ఆ ప్రపంచం నచ్చింది చైతన్యకు. అప్పట్నుంచీ ఆమె బ్రిటిష్‌ లైబ్రరీకి వెళ్లని రోజు దాదాపుగా లేనే లేదు. అయితే తను ఒకనాటికి బ్రిటిష్‌ హై కమిషనర్‌గా విధులను నిర్వహించబోతానని మాత్రం ఆమె ఊహించలేదు!

ఢిల్లీలోని బ్రిటిష్‌ హై కమిషన్‌ కార్యాలయంలో మొన్న బుధవారం 'ఒకరోజు హై కమిషనర్‌' గా విధులు నిర్వహించింది చైతన్య. రోజూ ఉండే యాక్టింగ్‌ కమిషనర్‌ జాన్‌ థామ్సన్‌ ఆ ఒక్కరోజు చైతన్యకు డిప్యూటీగా వ్యవహరించారు. ఒక్కరోజులోనే చైతన్య చాలా పనులు చక్కబెట్టింది! (చక్కబెట్టారు అనాలేమో.. హై కమిషనర్‌ కదా). హై కమిషన్‌ కార్యాలయంలోని వివిధ విభాగాల ప్రధాన అధికారులలో చైతన్య సమావేశం అయ్యారు. సీనియర్‌ మహిళా పోలీసు అధికారులతో సంభాషించారు. ప్రెస్‌మీట్‌ పెట్టారు. యువతుల కోసం ఒక స్కాలర్‌షిప్‌ ప్రోగ్రామ్‌ని ప్రారంభించారు. తెలంగాణ, మధ్యప్రదేశ్‌ పోలీసు అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. 'ఆనందబజార్‌' పత్రిక ఎడిటర్‌తో ముచ్చటించారు. బ్రిటన్‌ ఆహార వస్తూత్పత్తుల గొలుసు విక్రయ దుకాణాల సంస్థ 'మార్క్స్‌ అండ్‌ స్పెన్సర్‌' ఇండియా టీమ్‌తో కూర్చున్నారు. క్షణం తీరిక లేకుండా చైతన్య చురుగ్గా బాధ్యతలను నిర్వర్తించడం చూసి ఆశ్చర్యపోయిన జాన్‌ థామ్సన్‌.. డ్యూటీ టైమ్‌ ముగిశాక చైతన్యను అభినందించారు. ఈ 'వన్‌ డే హై కమిషనర్‌' అవకాశం కోసం దేశవ్యాప్తంగా 215 మంది యువతులు పోటీపడ్డారు. 'ప్రస్తుత కోవిడ్‌ పరిస్థితుల్లో లైంగిక సమానత్వానికి అంతర్జాతీయంగా ఎదురయ్యే సవాళ్లు, కలిసొచ్చే అవకాశాలు ఎలా ఉంటాయని మీరు భావిస్తున్నారు?' అనే ప్రశ్నకు చైతన్య ఇచ్చిన వీడియో ప్రెజెంటేషన్‌ ఎక్కువ మార్కులు సాధించి, ఆమెను విజేతను చేసింది. అయినా.. ఒక రోజుకు హై కమిషనర్‌గా ఉంటే ఏమౌతుంది అనే ఆలోచన రానివ్వకండి. మహిళలకు అధికారాన్ని ఇచ్చేందుకు ప్రపంచాన్ని సిద్ధం చెయ్యడం ఇది. స్త్రీ పురుష సమానత్వ సాధన కోసం. మానవాళి మేలు కోసం.

చక్కగా మాట్లాడగలగాలి...
ఢిల్లీలోని బ్రిటిష్‌ హై కమిషన్‌ కార్యాలయం వరల్డ్‌ 'గర్ల్‌ చైల్డ్‌' డే (అక్టోబర్‌ 11) సందర్భంగా 2017 నుంచి 18–23 సంవత్సరాల వయసు గల యువతులకు ఏటా ఒక రోజు హై కమిషనర్‌గా ఉండే అవకాశాన్ని కల్పిస్తోంది. ఇందుకోసం దేశవ్యాప్తంగా ఒక నిముషం నిడివి మించని సెల్ఫ్‌ వీడియో ప్రెజెంటేషన్‌ రూపంలో ఎంట్రీలు ఆహ్వానిస్తోంది. ఒక థీమ్‌ ఉంటుంది. ఆ థీమ్‌ని బట్టి వీడియోలో చక్కగా మాట్లాడగలగాలి. ప్రారంభ సంవత్సరంలో రుద్రాళీ పాటిల్‌ విజేతగా నిలిచింది. రుద్రాళీ నోయిడా 'లా' విద్యార్థిని. బాలికల హక్కులు–సమాజంలో మార్పు తెచ్చేందుకు రెండు పరిష్కార మార్గాలు అనేది ఆ ఏడాది అంశం. 45 మందితో పోటీ పడి రుద్రాళీ ఆ అవకాశం దక్కించుకుంది. 2018లో ఈషా బహాల్‌ గెలుపొందింది. స్త్రీ, పురుష సమానత్వం అంటే మీ దృష్టిలో ఏమిటి? అనే అంశంలో 58 మంది పోటీదారులను ఈషా నెగ్గుకొచ్చింది. ఆమెది కూడా నోయిడానే. డిగ్రీ విద్యార్థిని. 2019లో ఈ అవకాశం ఆయేషా ఖాన్‌కు లభించింది. ఆమెది గోరఖ్‌పూర్, పీజీ విద్యార్థిని. లైంగిక సమానత్వం అవసరం ఏమిటి? అనే అంశంపై ఆయేషా దాదాపు వందమంది ప్రత్యర్థులను దాటి హై కమిషనర్‌ అయ్యే అవకాశం సాధించింది.
Published date : 14 Oct 2020 05:57PM

Photo Stories