Skip to main content

నిరుద్యోగిత పెద్ద సవాల్: పీహెచ్‌డీసీసీఐ

న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జీడీపీ మైనస్ 7.9 శాతం నమోదు అవుతుందని పరిశ్రమల సమాఖ్య పీహెచ్‌డీసీసీఐ తెలిపింది.
‘2021-22లో జీడీపీ 7.7 శాతం వృద్ధి సాధిస్తుంది. ఆర్థిక పరిస్థితి నెమ్మదిగా పుంజుకుంటోంది. ప్రభుత్వం ముందు నిరుద్యోగిత పెద్ద సవాల్‌గా నిలవనుంది. నిరుద్యోగిత రేటు జూలైలో 7.4 శాతం ఉంటే, ఆగస్టులో ఇది 8.3 శాతానికి ఎగసింది. రానున్న రోజుల్లో చైనా నుంచి దిగుమతులను భారత్ తగ్గించాలి. దేశీయంగా తయారీ సామర్థ్యాలను పెంచాలి. స్వావలంబన దిశగా సాగాలి. స్నేహపూర్వక దేశాలతో వాణిజ్యం పెంపొందించాలి. కొత్త దేశాలకు ఎగుమతి చేసేందుకు వీలుగా విభిన్న ఉత్పత్తుల తయారీలోకి ప్రవేశించాలి. భారత్‌కు శక్తి సామర్థ్యాలున్న ఉత్పత్తులపై పెద్ద ఎత్తున దృష్టిసారించాలి. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న సంస్కరణల ఫలితంగా ఆర్థిక పరిస్థితి పుంజుకోవడం కనిపిస్తోంది. డిమాండ్‌ను సృష్టించే చర్యలను ప్రభుత్వం చేపట్టాలి. తద్వారా తయారీదారుల్లో సెంటిమెంటు బలపడుతుంది. పెట్టుబడులు అధికమై ఉద్యోగాలు సృష్టించే వీలవుతుంది. మౌలిక రంగంలో పెట్టుబడులు వృద్ధికి తోడై స్టీలు, సిమెంటు, విద్యుత్ డిమాండ్ పెరుగుతుంది. తద్వారా ప్రైవేటు పెట్టుబడుల్లో చైతన్యం వస్తుంది. కొత్త ఉద్యోగావకాశాలు లభిస్తాయి’ అని పీహెచ్‌డీసీసీఐ ప్రెసిడెంట్ సంజయ్ అగర్వాల్ వివరించారు.
Published date : 27 Oct 2020 03:41PM

Photo Stories