నిబంధనలు రూపొందించకుండా ఇంటర్ ఆన్‌లైన్ ప్రవేశాలా?.. హైకోర్టు
Sakshi Education
సాక్షి, అమరావతి: ఇంటర్ ఆన్‌లైన్ ప్రవేశాల విషయంలో ఏం చేసినా చట్ట నిబంధనలకు లోబడి మాత్రమే చేయాలని ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు స్పష్టం చేసింది.
చట్టప్రకారం ఎలాంటి నిబంధనలు రూపొందించకుండా ఆన్‌లైన్ ప్రవేశాలను ఎలా చేపడతారంటూ ఇంటర్మీడియట్ బోర్డును, రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఈ మొత్తం వ్యవహారంలో కౌంటర్ దాఖలు చేసేందుకు ప్రభుత్వానికి వెసులుబాటునిచ్చింది. తదుపరి విచారణను ఆగస్టు 24కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ నైనాల జయసూర్య గురువారం ఉత్తర్వులు జారీచేశారు. ఇంటర్మీడియట్‌లో ప్రవేశాల నిమిత్తం తీసుకొచ్చిన ఆంధ్రప్రదేశ్ ఆన్‌లైన్ అడ్మిషన్ సిస్టం ఫర్ ఇంటర్మీడియట్ స్ట్రీం (ఏపీవోఏఎస్‌ఐఎస్)ను సవాలు చేస్తూ సెంట్రల్ ఆంధ్ర జూనియర్ కాలేజీ మేనేజ్‌మెంట్స్ అసోసియేషన్ కార్యదర్శి దేవరపల్లి రమణారెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై గురువారం జస్టిస్ జయసూర్య విచారణ జరిపారు. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది బి.ఆదినారాయణరావు వాదనలు వినిపిస్తూ.. నిబంధనలు రూపొందించకుండా కేవలం పత్రికా ప్రకటన ద్వారా ఆన్‌లైన్ ప్రవేశాల విధానాన్ని తీసుకురావడం చట్ట విరుద్ధమని చెప్పారు. ఇంటర్ బోర్డు చర్య ఏకపక్షమన్నారు. గత ఏడాది కూడా ఇలాగే ప్రెస్‌నోట్ ద్వారా ప్రవేశాలు చేపట్టేందుకు ఇంటర్ బోర్డు చేసిన ప్రయత్నాలను హైకోర్టు తప్పుపట్టిందని వివరించారు. నిబంధనల ప్రకారం కాకుండా ప్రెస్‌నోట్ ద్వారా ఆన్‌లైన్ ప్రవేశాలు చేపట్టడం సరికాదని, ఈ వ్యవహారంలో జోక్యం చేసుకుని ఆన్‌లైన్ ప్రవేశాలపై స్టే విధించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది దుష్యంత్ దవే జోక్యం చేసుకుంటూ.. విద్యార్థుల ప్రయోజనం కోసమే ఆన్‌లైన్ ప్రవేశాలు చేపట్టామని తెలిపారు. ఈ విధానం ద్వారా విద్యార్థులకు లబ్ధి చేకూరుతుందన్నారు. న్యాయమూర్తి స్పందిస్తూ.. ఏం చేసినా చట్ట ప్రకారమే చేయాలని స్పష్టం చేశారు. తమ ఉద్దేశం కూడా అదేనని, చట్ట విరుద్ధంగా ఎలాంటి చర్యలు ఉండవని దుష్యంత్ దవే తెలిపారు. ఈ వ్యవహారంలో పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేస్తామన్నారు. ఇందుకు న్యాయమూర్తి అంగీకరిస్తూ దవే అభ్యర్థన మేరకు తదుపరి విచారణను ఈ నెల 24కి వాయిదా వేశారు. ఇదే అంశంపై పదవ తరగతి పాసైన విద్యార్థులు కొందరు దాఖలు చేసిన వ్యాజ్యాల్లో కూడా విచారణను న్యాయమూర్తి ఆ రోజుకే వాయిదా వేశారు.
Published date : 20 Aug 2021 07:11PM