నేవీలో మహిళా ఆఫీసర్లకు శాశ్వత కమిషన్
Sakshi Education
న్యూఢిల్లీ: భారత నావికా దళంలోని మహిళా ఉద్యోగుల కోసం శాశ్వత కమిషన్ ఏర్పాటు చేయాల్సిందేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
ఇందుకు సంబంధించిన విధివిధానాలు మూడు నెలల్లోగా పూర్తి చేయాలని కేంద్రాన్ని ఆదేశించింది. నేవీలో మహిళా అధికారులకు శాశ్వత కమిషన్ ఏర్పాటు కోరుతూ దాఖలైన పిటిషన్‌పై జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ అజయ్ రస్తోగితో కూడిన ధర్మాసనం మార్చి 17న విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ధర్మాసనం.. ‘సాయుధ దళాల్లో లింగ సమానత్వం అమలుకు సాకులు చూపడం సరి కాదు. మహిళా అధికారులను పురుషులతో సమానంగా చూడాల్సిన అవసరం ఉంది. సామర్ధ్యం, పోటీతత్వం, పనితీరు ఆధారంగా బాధ్యతలను అప్పగిస్తే వారికి వివక్షను అధిగమించే అవకాశం ఇచ్చినట్లవు తుంది. దేశం కోసం పనిచేస్తున్న మహిళా అధికారుల కోసం శాశ్వత కమిషన్ ఏర్పాటు చేయకపోవడం తీవ్ర అన్యాయమే అవుతుంది’ అని వ్యాఖ్యానించింది. నేవీలో మహిళా అధికారులు చూపిన ధైర్యసాహసాలు, చేసిన త్యాగాలు మరువలేనివని పేర్కొన్న ధర్మాసనం..‘1991, 1998ల్లో కేంద్రం ప్రకటించిన విధానాల ప్రకారం నేవీలోనూ మహిళలను నియ మించుకోవచ్చు. అంతేకాదు, వారిని పురుష అధికారులతో సమానంగా పరిగణించాల్సిందే’ అని తెలిపింది. మహిళల కోసం ప్రత్యేక కమిషన్‌ను ఏర్పాటు చేయాలని, ఇందుకు సంబంధించిన విధివిధానాలను మూడు నెలల్లోగా పూర్తి చేయాలని కేంద్రాన్ని ఆదేశించింది. నేవీలోని కొన్ని కేడర్లలో మహిళలను నియమించరాదంటూ 2008లో ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేయరాదని ధర్మాసనం ఆదేశించింది. షార్ట్ సర్వీస్ కమిషన్(ఎస్‌ఎస్‌సీ)లోని విద్య, న్యాయం, రవాణా విభాగాల్లో ప్రస్తుతం విధులు నిర్వర్తించే వారందరికీ శాశ్వత కమిషన్ వర్తిస్తుందని స్పష్టం చేసింది. 2008కి ముందు విధుల్లో చేరి శాశ్వత కమిషన్ లేకపోవడంతో నష్టపోయిన మహిళా అధికారులు రిటైరైన తర్వాత అందే పింఛను ప్రయోజనా లను పొందవచ్చని ధర్మాసనం స్పష్టం చేసింది.
Published date : 18 Mar 2020 04:42PM