నేటి నుంచి కానిస్టేబుళ్ల పాసింగ్ ఔట్ పరేడ్
రాష్ట్ర వ్యాప్తంగా వివిధ యూనిట్లలో వీరందరికీ బుధవారం నుంచి మూడ్రోజులపాటు పాసింగ్ ఔట్ పరేడ్ (పీవోపీ) కార్యక్రమం జరగనుంది. 10 నుంచి 17వ తేదీ వరకు కేడెట్లు అందరికీ సెలవులు ఇచ్చారు. 18న వీరికి అపాయింట్‌మెంట్లు అందించనున్నారు. అదేరోజు పోస్టింగ్ వివరాలు కూడా ఖరారు చేయనున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ స్టేట్ పోలీస్ అకాడమీ(టీఎస్‌పీఏ)లో మొదలయ్యే తొలి కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విమెన్‌సేఫ్టీ వింగ్ చీఫ్, ఏడీజీ స్వాతీ లక్రా హాజరుకానున్నారు.
210 రోజులకుపైగా అకాడమీల్లోనే..
జనవరి 16న రాష్ట్రంలో కానిస్టేబుల్ శిక్షణకు ఎంపికైన దాదాపు 12 వేలకుపైగా సివిల్, ఆర్మ్‌డ్ ఫోర్స్‌డ్ (ఏఆర్) విభాగాలకు శిక్షణ మొదలైంది. అదే సమయంలో కరోనా వైరస్ విజృంభించడంతో వీరంతా మార్చి తర్వాత ఎలాంటి సెలవు లేకుండా ఏకధాటిగా 210 రోజులకుపైగా శిక్షణ అకాడమీల్లోనే గడిపారు. కరోనా కారణంగా విధించిన లాక్‌డౌన్‌తో వీరెవరినీ ఇంటికి అనుమతించలేదు. మేలో సెమిస్టర్ ముగిసిన తర్వాత వారంరోజులు ఇవ్వాల్సిన సెలవులు కూడా ఇవ్వలేదు. ఫలితంగా ఇప్పుడు వారం ముందే పాసింగ్ ఔట్ పరేడ్ నిర్వహించి ఇంటికి పంపుతున్నారు. ఏడు నెలల ఏకధాటి శిక్షణ తర్వాత కుటుంబ సభ్యులను కలిసేందుకు ఎంతో ఉద్వేగంతో ఎదురుచూస్తున్నామని పలువురు కేడెట్లు ‘సాక్షి’తో చెప్పారు.