Skip to main content

నైపుణ్య ఉద్యోగాల కల్పనలో మూడో స్థానంలో హైదరాబాద్: లింక్డ్‌ఇన్ ఇండియాసర్వే

సాక్షి, హైదరాబాద్: నైపుణ్యం కలిగిన ఉద్యోగులను ఆకర్షించటంలో దేశంలో మొదటి మూడు నగరాల్లో హైదరాబాద్ స్థానం దక్కించుకుంది.
ఈ విషయంలో దేశ రాజధాని ఢిల్లీ తొలిస్థానంలో నిలిచింది. ద్వితీయస్థానంలో గ్రీన్‌సిటీ బెంగళూరు నిలిచింది. నైపుణ్యం గల ఉద్యోగులకు విసృ్తత అవకాశాలు కల్పిస్తున్న నగరాలపై అతిపెద్ద ’ప్రొఫెషనల్ నెట్‌వర్క్’అయిన ‘లింక్డ్‌ఇన్’ తాజా అధ్యయనం ‘భారత ఉద్యోగస్తుల నివేదిక’లో ఈ వివరాలు వెల్లడించింది. కొత్తగా ఏఏ రంగాల్లో ఉద్యోగాలు అధికంగా వస్తున్నాయి.. ఎటువంటి నిపుణులకు గిరాకీ ఉంది.. దేశంలోని ఏఏ నగరాలు సమర్థులైన ఉద్యోగులను ఆకర్షించగలుగుతున్నాయి... అనే విశేషాలతో ఈ నివేదికను లింక్డ్‌ఇన్ రూపొందించింది. యువ ఉద్యోగులు భారత్‌లోనే అధికం..

ప్రపంచవ్యాప్తంగా యువ జనాభా, యువ ఉద్యోగులు అత్యధిక సంఖ్యలో ఉన్న దేశం భారతేనని ఈ నివేదిక పేర్కొంది. ఉద్యోగాలు, ఉద్యోగస్తుల తీరుతెన్నులను ప్రతిబింబిస్తూ ఈ నివేదిక రూపొందించినట్లు లింక్డ్‌ఇన్ ఇండియా పేర్కొంది. సాఫ్ట్‌వేర్ ఇంజనీరింగ్, బిజినెస్ మేనేజ్‌మెంట్ రంగాలకు 2020 తొలి త్రైమాసికంలో విశేష గిరాకీ కనిపించినట్లు తెలిపారు. నైపుణ్యం కలిగిన నిపుణులను ఆకర్షించటంలో ముందున్న నగరాలు ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్ తొలిమూడు స్థానాల్లో ఉన్నాయి. ఆ తర్వాతి స్థానాల్లో ముంబై, చెన్నై, కోల్‌కతా, అహ్మదాబాద్ చండీగఢ్, వడోదర, జయపుర ఉన్నాయి.

ఈ రంగాల్లోనే అత్యధిక కొలువులు..
  • సాఫ్ట్‌వేర్, ఐటీ సేవలు
  • తయారీ రంగం, ఫైనాన్స్, కార్పొరేట్ సేవలు
  • విద్యా రంగం

యువతలో డాలర్ డ్రీమ్స్..
దేశంలో పలు మెట్రో నగరాల్లో విసృ్తత ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తున్నప్పటికీ యువతలో డాలర్ డ్రీమ్స్ కనుమరుగు కాలేదని ఈ నివేదిక స్పష్టం చేసింది. కాస్తోకూస్తో చదువుకొని విదేశాలకు వెళ్లి మంచి ఉద్యోగంలో స్ధిరపడాలని కోరుకునే యువకుల సంఖ్య ఇటీవల కాలంలో పలు నగరాల్లో పెరిగిపోతోందని ఈ నివేదిక వెల్లడించింది. యువత ప్రధానంగా ఏ దేశాలకు వెళుతున్నారనేది పరిశీలించగా.. మొదట అమెరికా ఉండగా, ఆ తర్వాత స్థానాల్లో యూఏఈ, కెనడా, యూకే, ఆస్ట్రేలియా దేశాలున్నాయి.

ఈ రంగాల్లో నైపుణ్యాలకు భలే గిరాకీ..
  • ఉత్పత్తి, నిర్మాణ రంగం, విద్యుత్, మైనింగ్ రంగాల్లో ఆటో క్యాడ్ నిపుణులకు గిరాకీ ఉంది
  • మేనేజ్‌మెంట్ ఉద్యోగార్థుల్లో నాయకత్వ లక్షణాలు, కస్టమర్ సర్వీస్, ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్ సామర్థ్యాలు ప్రదర్శించే వారికి పెద్దగా వెతుక్కునే పనిలేకుండానే ఉద్యోగాలు లభించే పరిస్థితి ఉంది.
  • ముంబై, ఢిల్లీ నగరాల్లో మేనేజ్‌మెంట్ రంగంలో అధికంగా ఉద్యోగాలున్నాయి. ఐటీ ఉద్యోగాలకు బెంగళూరు సిటీ కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిందని తాజా నివేదిక వెల్లడించింది.
Published date : 05 Mar 2020 04:30PM

Photo Stories