Skip to main content

మధ్యాహ్న భోజనం నాణ్యతలో రాజీపడొద్దు: ఏపీ సీఎం వైఎస్ జగన్

సాక్షి, అమరావతి: ‘మధ్యాహ్న భోజనం నాణ్యతలో ఎక్కడా రాజీ పడొద్దు. అన్ని ప్రాంతాల్లో ఒకే రకమైన నాణ్యత ఉండాలి. ఎక్కడ తిన్నా రుచి ఒకేలా ఉండాల్సిందే.
పులివెందులలో తిన్నా.. అమరావతిలో తిన్నా రుచి మారకూడదు’ అని ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. నాణ్యత కోసం నాలుగు అంచెల విధానంలో తనిఖీలు ఉండాలని సూచించారు. పౌష్టికాహారంతో కూడిన మెనూతో మధ్యాహ్న భోజనం ఈ నెల 21 నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో శనివారం ఆయన ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నాణ్యత తనిఖీతో పాటు ఫీడ్ బ్యాక్ కోసం పాఠశాల స్థాయిలో పేరెంట్స్ కమిటీ లో ముగ్గురు తల్లులను నియమించాలని చెప్పారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడికి కూడా కమిటీలో చోటు కల్పించాలన్నారు. పేరెంట్స్ కమిటీ పిల్లల తో కలిసి భోజనం చేసి నాణ్యత పరిశీలించాలని సీఎం సూచించారు. ఈ కమిటీ నాడు - నేడు, పారిశుధ్యాన్ని కూడా పరిశీలించాలన్నారు. తనిఖీల పర్యవేక్షణ బాధ్యతలు ఆర్డీఓకు అప్పగిం చాలని, క్వాలిటీతో పాటు ఫుడ్ సేఫ్టీపై కూడా దృష్టి పెట్టాలని సూచించారు. నాణ్యతతో కూడిన మధ్యాహ్న భోజనం పథకం కోసం ఏటా రూ.1,300 కోట్లు ఖర్చు పెడుతున్నామని, ఈ పథకాన్ని ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నామని చెప్పారు. ఆయాలకు రూ.3 వేలు వేతనం, సరుకుల ఖర్చులకు గ్రీన్ చానల్‌లో ఎప్పటి కప్పుడు చెల్లింపులు ఉంటాయన్నారు.

ప్రత్యేకంగా మొబైల్ యాప్
మధ్యాహ్న భోజనం పథకం అమలు కోసం ప్రత్యేకంగా మొబైల్ యాప్‌ను రూపొందిస్తున్నా మని ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో ఈ యాప్ పని చేస్తుందని తెలిపారు. ప్రస్తుతం దీనిని మెనూ పరిశీలన కోసం ఉపయోగిస్తామని వివరించారు. ఆహార నాణ్యత తనిఖీ కోసం కూడా ఉపయోగించే దిశగా కూడా ఆలోచిస్తున్నామని చెప్పారు. దీనిపై సీఎం స్పందిస్తూ.. నాణ్యత తనిఖీల పర్యవేక్షణకు వాడితే బాగుంటుందన్నారు.

తనిఖీలు ఇలా..
  •  పేరెంట్స్ కమిటీ పిల్లలతో కలిసి భోజనం చేసి నాణ్యత పరిశీలించాలి.
  • గ్రామ సచివాలయాల ద్వారా తనిఖీలు నిర్వహించాలి.
  •  పొదుపు సంఘాలతో తనిఖీ చేయించాలి.
  •  సెర్ఫ్ లేదా మరో సంస్థ ద్వారా తనిఖీ చేపట్టాలి.
Published date : 20 Jan 2020 03:05PM

Photo Stories