లక్ష్యం ఉంటేనే ఎదుగుదల సాధ్యం!
Sakshi Education
పేదవాడిగా పుట్టడం తప్పు కాదు. పేదవాడిగా మరణించడం మాత్రం తప్పే.
ఎందుకంటే ఎవరు ఏ ఇంట పుడతారో ఎవరికీ తెలియదు. కోటీశ్వరుడి ఇంటిలో పుట్టడం లేదా పేదవాడి ఇంట జన్మించడం మన చేతిలో మాత్రం లేదు. అయితే కోటీశ్వరుడిగా మరణించాలా లేదా ఇలాగే ఇబ్బందిపడుతూ మరణించాలా అనేది మాత్రం మన చేతిలో ఉంటుంది. తండ్రి పేదవాడు కావొచ్చు. అందులో తప్పేమీ లేదు. అయితే ఆయన కడుపున పుట్టిన మనం అంతకంటే ఉన్నతస్థితికి చేరుకోవాలా వద్దా అనేది నిర్ణయించుకోవాల్సింది మాత్రం మనమే. ఆ నిర్ణయాన్నే లక్ష్యం అంటారు. గోల్ అంటాం. గోల్ ఉన్నవాడికీ లేనివాడికీ ఒకటే తేడా. లక్ష్యాన్ని నిర్దేశించుకొన్నవాడు జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తాడు. అందుకు విరుద్ధంగా జీవించినవాడు లక్ష్యసాధకుడి కింద ఉద్యోగిగా జీవితాన్ని సాగిస్తాడు. సమయాన్ని సద్వినియోగం చేసుకొన్నవాడు వ్యాపారవేత్తగానో లేక వైద్యుడిగానో లేక ఇంజనీర్‌గానో ఎదుగుతాడు. సమయాన్ని దుర్వినియోగం చేసుకొన్నవాడు ఆ వ్యక్తి కింద పనిచేయాల్సి వస్తుంది. అందువల్ల ఉద్యోగిగా ఎదుగుబొదుగులేని జీవితం గడపాలా లేక పదిమందికి ఉపాధి కల్పించి ఉన్నతంగా,. ఆదర్శంగా జీవించాలా అనేది విద్యార్థి దశలోనే నిర్ణయించుకోవాలి. జీవితంలో నాలుగు దశలు ఉంటాయి. బాల్యం...ఈ దశలో ఆటపాటలు తప్ప మరో లోకం ఉండదు. బాల్యం నుంచి మెల్లగా ఎదుగుతూ బడిలో చేరి చదువుకొంటూ యవ్వనంలోకి అడుగుపెడతారు. ఇది రెండో దశ. ఈ దశే జీవితానికి పునాది వంటిది. పునాది బలంగా ఉంటే ఎన్ని అంతస్తులైనా నిర్మించవచ్చు. అదే పునాది బలహీనంగా ఉంటే ఏ దశలోనైనా కూలిపోతుంది. కాబట్టి విద్యార్థి దశలో భవిష్యత్తుకు చక్కని ప్రణాళికలు రూపొందించుకోవాలి. ఆ ప్రణాళిక ప్రకారం ముందుకుసాగాలి. అప్పుడే విజయం సాధించగలుగుతాం.
Published date : 06 Mar 2020 01:55PM