కోవిడ్ దెబ్బతో బయోమెట్రిక్ హాజరు విధానాన్ని నిలిపివేస్తున్న విద్యా సంస్థలు
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: కోవిడ్ వైరస్ దెబ్బతో బయోమెట్రిక్ హాజరు విధానాన్ని విద్యా సంస్థలు క్రమంగా నిలిపివేస్తున్నాయి.
కోవిడ్ కారణంగా షేక్ హ్యాండ్ ఇవ్వవద్దని, వీలైనన్ని ఎక్కువ సార్లు చేతులు కడుక్కోవాలని ప్రచారం చేస్తున్న నేపథ్యంలో విద్యార్థులంతా ఒకరి తరువాత ఒకరు వేలి ముద్రలు వేయాల్సిన బయోమెట్రిక్ హాజరును తాత్కాలికంగా నిలిపివేస్తున్నాయి. ఇప్పటికే ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ బయోమెట్రిక్ హాజరు విధానాన్ని తాత్కాలికంగా నిలిపివేయగా, కాకతీయ యూనివర్సిటీ కూడా తమ పరిధిలోని కాలేజీల్లో బయోమెట్రిక్ హాజరు విధానం నిలిపివేయాలని ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలిసింది. మరోవైపు జేఎన్‌టీయూ, ఉస్మానియా యూనివర్సిటీలు, పాలిటెక్నిక్ కాలేజీలు, పాఠశాలల్లోనూ బయోమెట్రిక్ హాజరు విధానం నిలిపివేతపై ఆలోచనలు చేస్తున్నాయి. ఒకటి రెండు రోజుల్లో దీనిపై నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిసింది. అయితే ఆయా విద్యా సంస్థల్లో టీచర్ల హాజరు ఎలా చేయాలన్న దానిపై ఆలోచనలు చేస్తున్నాయి. విద్యా సంస్థల వారీగా చూస్తే వారు తక్కువగానే ఉంటారు కనుక చేతులు బాగా శుభ్రం చేసుకొని వేలి ముద్రలు వేసేలా, ఆ తరువాత మళ్లీ శుభ్రం చేసుకునేలా చర్యలు చేపట్టాలని భావిస్తున్నట్లు తెలిసింది.
Published date : 11 Mar 2020 03:16PM