Skip to main content

జూలై 3న జేఈఈ అడ్వాన్స్‌డ్‌ – 2021... షెడ్యూల్‌ ఇదిగో..

సాక్షి, అమరావతి: ఇండియన్ ఇన్స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఐఐటీ)ల్లో ప్రవేశానికి జాయింట్‌ ఎంట్రెన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) అడ్వాన్స్‌డ్‌–2021 పరీక్షను జూలై 3న నిర్వహించనున్నారు.
ఈ మేరకు పరీక్ష నిర్వహణ సంస్థ.. ఐఐటీ ఖరగ్‌పూర్‌ షెడ్యూల్‌ను ప్రకటించింది. జూలై 3న ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పేపర్‌–1, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పేపర్‌–2 పరీక్షలను ఆన్‌లైన్ లో నిర్వహిస్తారు. అయితే.. పూర్తి వివరాలతో అధికారిక నోటిఫికేషన్ ను విడుదల చేయాల్సి ఉంది. కాగా, జేఈఈ మెయిన్ ను ఈసారి ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మేలో ఆన్‌లైన్ లో నిర్వహిస్తున్నారు. ఫిబ్రవరి సెషన్ కు సంబంధించి ఫలితాలను ఒకటి రెండు రోజుల్లో విడుదల చేయనున్నారు. నాలుగు విడతల పరీక్షలు ముగిశాక నిర్ణీత కటాఫ్‌ మార్కులు సాధించిన అభ్యర్థుల్లో టాప్‌ 2.50 లక్షల మందిని జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు ఎంపిక చేస్తారు. ఈ పరీక్ష అనంతరం ఐఐటీల్లో ఆర్కిటెక్చర్‌ కోర్సులకు.. ఆర్కిటెక్చర్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ (ఏఏటీ)ని నిర్వహిస్తారు. దీని తేదీలను ఇంకా ఖరారు చేయాల్సి ఉంది. ఈ ఫలితాలు కూడా విడుదలయ్యాక ఐఐటీలు, ఎన్ఐటీలు, ఇతర సంస్థల్లో సీట్ల కేటాయింపు ప్రక్రియను జాయింట్‌ సీట్‌ అలొకేషన్ అథారిటీ చేపడుతుంది.

జేఈఈ అడ్వాన్స్‌డ్‌ – 2021 సిలబస్, స్టడీ మెటీరియల్, టైం టేబుల్, ఎగ్టామ్‌ పాట్రన్, మాక్‌ టెస్ట్స్, ప్రీవియస్‌ పేపర్స్‌... ఇతర తాజా అప్‌డేట్స్‌ కోసం క్లిక్‌ చేయండి.

జేఈఈ మెయిన్ అభ్యర్థులకు సవరణల అవకాశం
కాగా, జేఈఈ మెయిన్ కు సంబంధించి మార్చి, ఏప్రిల్, మే సెషన్లకు దరఖాస్తు చేసినవారు సవరణలు చేసుకోవడానికి అవకాశం కల్పిస్తున్నట్లు నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్టీఏ) ప్రకటన విడుదల చేసింది. ఈ సెషన్లకు దరఖాస్తు చేసిన అభ్యర్థులు సిటీ, సెషన్, కేటగిరీ, సబ్జెక్టు తదితరాల్లో మార్పులుచేర్పులుంటే మార్చి 6లోగా చేసుకోవచ్చని వివరించింది. ఎన్టీఏ వెబ్‌సైట్‌ ‘డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.ఎన్టీఏ.ఏసీ.ఐఎన్’ లేదా ‘హెచ్‌టీటీపీఎస్‌://జేఈఈమెయిన్.ఎన్టీఏ.ఎన్ఐసీ.ఐఎన్’ వెబ్‌సైట్ల ద్వారా సవరణలు చేసుకోవచ్చని పేర్కొంది. జేఈఈ మెయిన్ కు అదనంగా మరో మూడు పరీక్ష కేంద్రాలను చేర్చింది. లడఖ్‌లోని కార్గిల్, మలేషియాలోని కౌలాలంపూర్, నైజీరియాలోని అబుజా/లాగోస్‌ల్లో వీటిని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది.

జేఈఈ మెయిన్‌ షెడ్యూల్‌ ఇదే..

సెషన్

తేదీలు

మార్చి

15, 16, 17, 18

ఏప్రిల్‌

27, 28, 29, 30

మే

24, 25, 26, 27, 28

Published date : 06 Mar 2021 04:09PM

Photo Stories