జనవరి 30న గురుకులాల్లోనూ ‘స్లాస్’
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో 8, 9 తరగతుల విద్యార్థుల్లో అభ్యసన సామర్థ్యాలను పరీక్షించేందుకు ఈనెల 30న నిర్వహించనున్నట్లు స్టేట్ లెవల్ అఛీవ్‌మెంట్ సర్వేను (స్లాస్) గురుకులాల్లోనూ నిర్వహించాలని విద్యాశాఖ నిర్ణయించింది.
సాంఘిక సంక్షేమ గురుకులాల సొసైటీ కార్యదర్శి డాక్టర్ ఆర్.ఎస్ ప్రవీణ్‌కుమార్ సూచన మేరకు అన్ని గురుకులాల్లోనూ స్లాస్ నిర్వహించాలని నిర్ణయించినట్లు పాఠశాల విద్యా కమిషనర్ విజయ్ కుమార్ తెలిపారు. రాష్ట్రంలోని 768 ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, విద్యాశాఖ గురుకులాలకు చెందిన 1,22,880 మంది విద్యార్థులను కూడా ఈ సర్వేలో భాగస్వాములను చేయనున్నట్లు వెల్లడించారు. ఆయా గురుకులాల్లో 8వ తరగతిలో 61,440 మంది, 9వ తరగతిలో 61,440 మంది విద్యార్థులు ఈ పరీక్షకు హాజరయ్యే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. ఇక 4,800కు పైగా ప్రభుత్వ పాఠశాలలకు చెందిన 4,84,601 మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరు కానున్నారు. 30వ తేదీన ఉదయం పదిన్నర గంటల నుంచి మధ్యాహ్నాం ఒంటిగంట వరకూ పరీక్ష ఉంటుందని, పరీక్షను పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు విజయ్‌కుమార్ వెల్లడించారు. ఈ పరీక్షకు ఇన్విజిలేటర్లుగా ఎస్‌జీటీలు, పీఈటీలను నియమించనున్నట్లు తెలిపారు.
Published date : 18 Jan 2020 02:15PM