Skip to main content

జీఎస్టీ రాకతోచార్టర్డ్ అకౌంట్స్(సీఏ)పైఆసక్తి కనబరుస్తున్న విద్యార్థులు

సాక్షి, హైదరాబాద్: చార్టర్డ్ అకౌంటెంట్స్‌కు చేతినిండా పని దొరుకుతోంది.
జీఎస్టీతో సీఏలకు గిరాకీ లభిస్తోంది. జీఎస్టీ రాక ముందుతో పోలిస్తే ఇటీవల డిమాండ్ బాగా పెరిగింది. గతంతో పోలిస్తే వేతనాలు కూడా రెండింతలయ్యాయి. సీఏలకు మంచి అవకాశాలు లభిస్తుండటంతో విద్యార్థులు సైతం ఆసక్తి కనబరుస్తున్నారు. జీఎస్టీలో ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్ వెసులుబాటు ఉంటుంది. ఈ మినహాయింపుతోనే డీలర్లకు ఎంతో లాభం చేకూరుతుంది. ముడి సరుకు సప్లయిదారు నుంచి రిటైలర్ దాకా అందరూ జీఎస్టీ వ్యవస్థలో భాగస్వాములైతేనే ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్‌ను క్లెయిమ్ చేసుకోవచ్చు. కానీ వీటికి లెక్కలన్నీ సక్రమంగా చూపించాల్సి ఉంటుంది. అయితే గతంలో వ్యాట్ ఉన్న సమయంలో రిటర్న్స్ ఫైల్ చేయడం సులభంగా ఉండేది. జీఎస్టీ వచ్చాక ఇది అందరికీ సాధ్యం కావడం లేదు. జాగ్రత్తగా ఫైల్ చేయాల్సి ఉంటుంది. ఫైలింగ్‌లో ఎలాంటి తప్పులున్నా ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్‌పై ప్రభావం పడుతుంది. అంతేకాకుండా గతంలో వ్యాట్ ఉన్నప్పుడు పేమెంట్ చేయకున్నా ఫైల్ అయ్యేది. కానీ జీఎస్టీలో పేమెంట్ చేస్తేనే ఫైల్ అవుతోంది. సీఏలకు డిమాండ్ పెరగడానికి ప్రధాన కారణం జీఎస్టీ చట్టం తీసుకురావడమేనని నిపుణులు పేర్కొంటున్నారు. కంపెనీల చట్టంలో ఎప్పటికప్పుడు కొత్త మార్పులు చేస్తుండటంతో వ్యాపార సంస్థలు విధానపరంగా నడుచుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సీఎల అవసరం పెరిగింది.

రెట్టింపు జీతాలు..
గతంలో బ్యాంకులు, ప్రభుత్వ శాఖల్లో ఆడిటింగ్ సంబంధిత శాఖల వారే చేసేవారు. అయితే బ్యాంకులు, ప్రభుత్వ శాఖల్లో చార్టెర్డ్ అకౌంటెంట్స్‌తో ఆడిటింగ్ జరిగే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. జీఎస్టీతో సీఏల అవసరంతో పాటు జీతాలు కూడా పెరిగాయి. కొత్తగా వస్తున్న సీఏలకు వార్షిక ఆదాయం రూ.8 లక్షల నుంచి రూ.10 లక్షల దాకా ఉంటోంది. సీనియారిటీ ఉన్నవారు ఆయా కంపెనీని బట్టి రూ.20 లక్షల నుంచి రూ.40 లక్షల వరకు తీసుకుంటున్నారు. ఇక గతంలో రిటర్న్స్ ఫైల్ చేయడానికి 2,050 మంది డీలర్లు మాత్రమే ఉండగా, ప్రస్తుతం 1,00,300 మంది ఉన్నారని సీఏలు పేర్కొంటున్నారు. ఇలా ఒక్కో డీలర్ వద్ద సగటున ఏడాదికి రూ.30,000 నుంచి రూ.40,000 దాకా తీసుకుంటున్నారు.

పెరుగుతున్న ఆసక్తి..
{పపంచంలో వ్యాపార, వాణిజ్య రంగంలో వేగంగా వస్తున్న మార్పులకు అనుగుణంగా సీఏల అవసరం పెరిగింది. డిమాండ్‌కు తగ్గట్టుగా ఈ కోర్సును పూర్తి చేసినవారు లేరని తెలుస్తోంది. దీంతో ఇటీవల కాలంలో సీఏ చేసేవారి సంఖ్య పెరిగిందని దేశంలోని ప్రొఫెషనల్ అకౌంటింగ్ సంస్థ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టెర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసీఏఐ) వెల్లడించింది. మహిళలు కూడా చార్టెర్డ్ అకౌంటెంట్ కోర్సుల పట్ల మక్కువ చూపుతున్నారని, ఇటీవల సీఏ కోర్సుల్లో 45 శాతం మంది విద్యార్థినులు ఉన్నారని తెలిపింది.
Published date : 16 Mar 2020 05:39PM

Photo Stories