జగనన్న అమ్మ ఒడి, వసతి దీవెన,విద్యా దీవెన పథకాలతో విప్లవాత్మక మార్పులు : ఆర్. కృష్ణయ్య
Sakshi Education
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అమలుచేస్తున్న వివిధ సంక్షేమ పథకాలతో ఎస్సీ, ఎస్టీ, బీసీ కుటుంబాలు సంపూర్ణ వికాసంతో శాశ్వత అభివృద్ధికి నోచుకుంటాయని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య తెలిపారు.
20ఏళ్ల తర్వాత ఈ సామాజికవర్గాలేవీ ప్రభుత్వ పథకాలపై ఆధారపడాల్సిన అవసరం ఉండదని ఆయన ఏప్రిల్ 28న ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జగనన్న అమ్మ ఒడి, జగనన్న వసతి దీవెన, జగనన్న విద్యా దీవెన వంటి పథకాలు దీర్ఘకాలంలో సమాజంలో విప్లవాత్మక మార్పులకు కారణమవుతాయని కృష్ణయ్య అభిప్రాయపడ్డారు. ఈ పథకాల ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలతో పాటు పేద కుటుంబంలోని ప్రతిఒక్కరూ ఉన్నత చదువులు చదివేందుకు అవకాశం ఏర్పడుతోందన్నారు. తద్వారా వారు మంచి ఉపాధి అవకాశాలు పొంది ఆర్థికంగా లబ్ధిపొందుతారని పేర్కొన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడా ఇలాంటి పథకాలు అమలుకావడంలేదని.. వీటికి శ్రీకారం చుట్టిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు ఎస్సీ, ఎస్టీ, బీసీ సామాజికవర్గాల తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నానని ఆయన వివరించారు. ఆర్థిక లోటు ఉన్న రాష్ట్రంలోనే రూ.12 వేల కోట్లతో ఈ పథకాలు అమలుచేస్తున్నారని.. అదే ఎటువంటి ఆర్థిక లోటులేని రాష్ట్రాలు కూడా ఈ తరహా పథకాలకు పూనుకోవాలని కృష్ణయ్య కోరారు.
Published date : 29 Apr 2020 04:34PM