Skip to main content

జేఈఈ మెయిన్ పరీక్షలపై ఎన్‌టీఏ కీలక వివరణ.. ఇక పండగే..!

సాక్షి, హైదరాబాద్: ఐఐటీ, ఎన్‌ఐటీ, ట్రిపుల్ ఐటీ, జీఎఫ్‌టీఐలలో వచ్చే విద్యా సంవత్సరంలో (2020-21) ప్రవేశాల కోసం నిర్వహించే జేఈఈ మెయిన్‌కు సంబంధించి విద్యార్థుల్లో నెలకొన్న సందేహాలకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) స్పష్టతనిచ్చింది.
కరోనా నేపథ్యంలో విద్యార్థులపై ఒత్తిడి తగ్గించేందుకు వచ్చే ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే నెలల్లో జేఈఈ మెయిన్‌ను నాలుగుసార్లు నిర్వహిస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. విద్యార్థులు ఆ నాలుగు సెషన్లలో ఎన్నింటికైనా హాజరుకావచ్చని పేర్కొంది. విద్యార్థులు పొరపాట్లను సరిదిద్దుకొని, తమ స్కోర్‌ను మెరుగు పర్చుకునేందుకు ఉపయోగపడుతుందని వెల్లడించింది. విద్యార్థులందరూ నాలుగు సెషన్లు రాయాల్సిన అవసరం లేదని, రాయాలనుకునే వారే వాటికి హాజరుకావాలని సూచించింది. విద్యార్థులు హాజరయ్యే సెషన్లలో ఏ సెషన్ పరీక్షలో ఎక్కువ స్కోర్ వస్తే దానినే 2021 ఎన్‌టీఏ స్కోర్‌గా పరిగణనలోకి తీసుకుంటామని స్పష్టం చేసింది. ఫిబ్రవరిలో సెషన్ పరీక్షకు విద్యార్థులు వచ్చే నెల 16వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని, 17వరకు ఫీజు చెల్లించవచ్చని వివరించింది. పరీక్షలు ఫిబ్రవరి 23, 24, 25, 26 తేదీల్లో ఉంటాయని తెలిపింది. ఆ పరీక్షల ఫలితాలు వెల్లడించాక 3నుంచి 4 రోజులకు మార్చిలో నిర్వహించే జేఈఈ మెయిన్‌కు దరఖాస్తులను స్వీకరిస్తామని పేర్కొంది.

Check JEE Cutoff scores, practice tests and previous papers

ఒకేసారి దరఖాస్తుకు వెసులుబాటు
ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే అన్ని సెషన్లకు ఒకేసారి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని ఎన్‌టీఏ తెలిపింది. ఇప్పుడు చేసే దరఖాస్తు ఫారంలో ఫిబ్రవరి సెషన్‌కు మాత్రమేనా, ఇతర సెషన్లకు ఇదేనా అనే ఆప్షన్‌ను ఎంచుకోవాలని స్పష్టం చేసింది. విద్యార్థులు ఏ సెషన్ పరీక్షకు హాజరు కావాలనుకుంటే ఆ సెషన్‌కు పరీక్ష ఫీజు చెల్లించాల్సి ఉంటుందని వెల్లడించింది. ఫిబ్రవరిలో పరీక్షకు దరఖాస్తు చేసుకోకపోయినా తర్వాతి పరీక్షలకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. నాలుగు సెషన్లకు హాజరు కావాలనుకుంటే ఇప్పుడే నాలుగు సెషన్ల ఫీజు చెల్లించాల్సి ఉంటుందని.. లేదంటే తర్వాతైనా దరఖాస్తు చేసుకోవచ్చని, అప్పుడైనా ఫీజు చెల్లించాల్సిందేనని పేర్కొంది. ఇప్పుడు నాలుగు సెషన్లకు ఫీజు చెల్లించి, ఫిబ్రవరి సెషన్ తర్వాత నెలల్లో నిర్వహించే పరీక్షలకు హాజరు కావద్దనకుంటే విద్యార్థులు వాటి దరఖాస్తుల సమయంలో విత్‌డ్రాకు దరఖాస్తు చేయాలని, అప్పుడు ఆ ఫీజును తిరిగి ఇస్తామని స్పష్టం చేసింది. ఈసారి తెలుగు సహా 13 భాషల్లో పరీక్షలను నిర్వహిస్తున్నట్లు వివరించింది.

వచ్చే నెల 23 వరకు జీప్యాట్, సీమ్యాట్ దరఖాస్తులు
జాతీయ స్థాయి విద్యాసంస్థల్లో ఎంఫార్మసీ, మేనేజ్‌మెంట్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించనున్న జీప్యాట్, సీమ్యాట్‌కు దరఖాస్తుల స్వీకరణను ఎన్‌టీఏ ప్రారంభించింది. జనవరి 23వ తేదీ వరకు స్వీకరిస్తామని పేర్కొంది. పరీక్షలను ఫిబ్రవరి 22, 27 తేదీల్లో నిర్వహించనున్నట్లు వెల్లడించింది.

‘గేట్’ పరీక్షలకు ఏర్పాట్లు
జాతీయ స్థాయి విద్యా సంస్థల్లో ఎంటెక్ కోర్సుల్లో ప్రవేశాలకు వచ్చే ఫిబ్రవరి 6, 7, 13, 14 తేదీల్లో గేట్ పరీక్షలు నిర్వహించేందుకు ఢిల్లీ ఐఐటీ ఏర్పాట్లు చేస్తోంది. హాల్‌టికెట్లను వచ్చే నెల 8 నుంచి వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనుంది.
Published date : 26 Dec 2020 02:31PM

Photo Stories