Skip to main content

ఇంటి నుంచి పనికే కంపెనీల మొగ్గు: ఈ ప్రభుత్వం గిగ్‌ వర్కర్లకు రాయితీలు..

సాక్షి, అమరావతి: ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి రెండోసారి విస్తరిస్తుండటంతో ఐటీ కంపెనీలు ఉద్యోగులను ఇంటి వద్ద నుంచి పనిచేసే విధానానికే (వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌కే) మొగ్గు చూపుతున్నాయి.
ఇప్పటికే దేశీయ అతిపెద్ద ఐటీ కంపెనీ టీసీఎస్‌ 2025 వరకు ఉద్యోగులను శాశ్వతంగా ఇంటి వద్ద నుంచే పనిచేయమని చెప్పేసింది. కోవిడ్‌కు ముందు మొత్తం ఉద్యోగుల్లో 20 శాతానికిలోపే వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ను వినియోగించుకునే వారని, కరోనా దెబ్బతో ఇప్పుడిది 90 శాతానికి చేరిందని టీసీఎస్‌ తెలిపింది. దేశంలో 3.5 లక్షలమంది ఉద్యోగులతో కలుపుకొని ప్రపంచవ్యాప్తంగా 46 దేశాల్లో టీసీఎస్‌లో 4.48 లక్షలమంది పనిచేస్తున్నారు. ఇందులో 75 శాతం మందిని శాశ్వతంగా 2025 వరకు ఇంటినుంచే పనిచేయిస్తామని టీసీఎస్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇదేబాటలో మరిన్ని కంపెనీలు దీర్ఘకాలం పాటు వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ విధానానికే మొగ్గు చూపుతున్నాయి. వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ వల్ల సగటు ఉద్యోగి నుంచి ఉత్పాదకశక్తి పెరగడంతో పాటు నిర్వహణ వ్యయం తగ్గడంతో కంపెనీలు ఈ విధానానికే సై అంటున్నాయి.

50 శాతం తగ్గుతున్న నిర్వహణ వ్యయం..
వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ వల్ల కొత్తగా ఏర్పాటయ్యే కంపెనీలకు నిర్వహణ వ్యయం 50 శాతం వరకు తగ్గుతుందని అంచనా. 5 వేలమంది సిబ్బందికి సరిపడా కార్యాలయం సిద్ధం చేయాలంటే రూ.200 కోట్ల నుంచి రూ.300 కోట్లు వ్యయం అవుతుందని, అదే వర్క్‌ ఫ్రమ్‌ హోమ్, కో–వర్కింగ్‌ వంటి విధానాలు అమలు చేస్తే నిర్వహణ వ్యయం రూ.100 కోట్ల నుంచి రూ.150 కోట్లకే పరిమితమవుతుందని చెబుతున్నారు. గ్లోబల్‌ వర్క్‌ ఫోర్స్‌ ఎనలటిక్స్‌ ప్రకారం ఇంటి వద్ద నుంచే పనిచేయడం ప్రారంభించిన తర్వాత కంపెనీల సగటు ఉద్యోగి ఉత్పాదక సామర్థ్యం 15 శాతం నుంచి 40 శాతం వరకు పెరిగింది. ఇదే సమయంలో ఉద్యోగి సెలవులు 40 శాతం తగ్గాయి. ఇటువంటి క్లిష్ట సమయంలో ఉద్యోగులు ఉన్న ఉద్యోగం వదిలేసి కొత్త ఉద్యోగ అవకాశాలను వెతుక్కోవడానికి కూడా వెనుకంజ వేస్తున్నారు. దీనివల్ల ఉద్యోగాలు మానేసేవారి సంఖ్య 10 నుంచి 15 శాతం తగ్గిపోయింది. కోవిడ్‌ సంక్షోభం రియల్‌ ఎస్టేట్‌ రంగంపై కూడా కనిపిస్తుండటంతో అద్దెలు 20 శాతం వరకు తగ్గినట్లు అంచనా వేశారు. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటే కంపెనీల నిర్వహణ లాభం 5 శాతం పెరిగింది.

గిగ్‌ వర్కర్లకు రాయితీలివ్వనున్న రాష్ట్ర ప్రభుత్వం
వర్క్‌ ఫ్రమ్‌ హోం డిమాండ్‌ పెరగనున్న నేపథ్యంలో ఈ అవకాశాలను అందిపుచ్చుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టిసారించింది. మూడు రోజుల కిందట విజయవాడలో జరిగిన సీఎక్స్‌వో సమావేశంలో కంపెనీ సీఈవోలతో ఈ అంశంపై ప్రత్యేకంగా సమీక్షించారు. వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ చేసేవారికి హైఎండ్‌ బ్రాండ్‌ విడ్త్‌ అందించే విధంగా చర్యలు తీసుకోవడంతోపాటు గ్రామీణ స్థాయిలో కూడా డిజిటల్‌ లైబ్రరీ పేరుతో కో–వర్కింగ్‌ స్టేషన్లను ఏర్పాటు చేస్తున్నట్లు ఐటీశాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి ప్రకటించారు. ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామ సచివాలయాల్లో 5 నుంచి 6 చొప్పున మొత్తం 90 వేలకుపైగా వర్క్‌ స్టేషన్లు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ఇదే సమయంలో ఐటీ కంపెనీల నుంచి ప్రాజెక్టులు తెచ్చుకుని సొంతంగా ఇంటి వద్ద నుంచే చేసుకునే వారికి (గిగ్‌ వర్కర్లకు) ప్రత్యేక రాయితీలు ఇచ్చే విధంగా 2020–23 ఐటీ పాలసీలో ప్రతిపాదించారు. గిగ్‌ వర్కర్లకు ఐటీ పరికరాల కొనుగోలుకు రూ.20 వేల రాయితీతో పాటు, ప్రత్యేక ప్రోత్సాహకం కింద రూ.50 వేలు ఇవ్వనున్నారు. ఇదే సమయంలో ఫైబర్‌నెట్‌ ద్వారా అడిగిన వాళ్లకి బ్రాండ్‌విడ్త్‌ ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.
Published date : 07 Apr 2021 05:30PM

Photo Stories