Skip to main content

ఇంగ్లిష్ మీడియం..పేదపిల్లల హక్కు: వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి

సాక్షి, అమరావతి: బడుగు, బలహీనవర్గాలతో పాటు అగ్రవర్ణాల్లోని పేద పిల్లలకు ఇంగ్లిష్ మీడియం విద్యను ఒక హక్కుగా అందిస్తామని, ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా వారికి జగన్ మామ తోడుగా ఉంటాడని సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్ విద్యా చట్టం (సవరణ) బిల్లుకు శాసనమండలి సూచించిన సవరణలను తోసిపుచ్చుతూ ప్రవేశపెట్టిన ప్రభుత్వ బిల్లుపై జనవరి 23 (గురువారం)న అసెంబ్లీలో జరిగిన చర్చలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాట్లాడుతూ.. శాసనసభ గతంలో ఆమోదించిన బిల్లునే యథాతథంగా తిరిగి ఆమోదించాలని సభకు విజ్ఞప్తి చేశారు. సమాజంలోని అన్ని వర్గాల్లోని పేద పిల్లల బతుకులు మార్చేందుకు ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం బోధనను తీసుకువచ్చామని.. వారికి కచ్చితంగా న్యాయం చేసి తీరుతామని చెప్పారు. పేదలకు న్యాయం చేసే కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు టీడీపీ ఎందుకు పాకులాడుతుందో అర్థం కావడం లేదన్నారు. జూన్ 1 నుంచి విద్యా దీవెన కింద ఒక్కో విద్యార్థికి రూ.1350 విలువైన కిట్ అందజేయనున్నట్లు తెలిపారు. అసెంబ్లీలో ముఖ్యమంత్రి ప్రసంగం ఆయన మాటల్లోనే..

ఇంగ్లీష్ విద్య ఉచితంగా దొరికితేనే బతుకుల్లో మార్పు
‘ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, అగ్రవర్ణాల్లోని పేదలు ప్రైవేట్ స్కూళ్లకు వేల రూపాయలు ఫీజులు కట్టలేకపోతున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియం విద్య ఉచితంగా దొరికితే తమ బతుకులు మారుతాయని దశాబ్దాలుగా వేచిచూస్తున్నారు. వారి గురించి పట్టించుకోని విధంగా ప్రస్తుతం వ్యవస్థలు తయారయ్యాయి. ప్రభుత్వ బడుల్లో పేదలు రూపాయి చెల్లించాల్సిన అవసరం లేకుండా వారి పిల్లలను ఇంగ్లిష్ మీడియంలో చదివించే పరిస్థితి కల్పిస్తున్నాం. రాష్ట్రంలో దాదాపు 45 వేలకు పైగా ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు ఉన్నాయి. ప్రాథమిక స్థాయిలోనే ఇంగ్లీషు మీడియం విద్యకు పునాది పడితే పిల్లలు పెరిగేకొద్దీ ఇంగ్లీషులో మాట్లాడడం, చదవడం సులభమవుతుంది. అలాంటి ప్రభుత్వ ప్రైమరీ స్కూళ్లలో ఇంతవరకు ఇంగ్లీషు మీడియం శాతం కేవలం 23.67 మాత్రమే.. అదే ప్రైవేటు స్కూళ్లలో 98.05 శాతం పిల్లలు ఇంగ్లీషు మీడియంలోనే చదువుతున్నారు. ఒక పద్ధతి ప్రకారం పేదలకు ఇంగ్లీష్ రాకూడదని, వారు పేదరికంలోనే ఉండాలని ఇన్నాళ్లు వదిలేశారు. ఈ వ్యవస్థను మార్చాలి. పేదవాడు భావి ప్రపంచంలో పోటీ పడే పరిస్థితి తీసుకురావాలనుకున్నాం. ఈవేళ కంప్యూటర్లలో మనకు కనిపించే భాష ఇంగ్లీషు. ఇంగ్లీషు భాష మాట్లాడితేనే మెరుగైన జీతాలు వచ్చే పరిస్థితి ప్రపంచంలో ఉంది. పేదల పిల్లల బతుకులు బాగుపడాలనే ఉద్దేశంతో ఇంగ్లీష్ మీడియం నిర్ణయం తీసుకున్నాం. పేదరికంలో ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, అగ్రవర్ణాలు సహా ఎవరైతే ప్రైవేట్ స్కూళ్లకు డబ్బులు కట్టలేక పిల్లలను తెలుగు మీడియానికి పరిమితం చేస్తున్నారో వారికి ఇంగ్లీషు మీడియంలో విద్యను అందిస్తాం.

రైట్ టు ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ అందిస్తాం
రైట్ టు ఎడ్యుకేషన్ కాకుండా.. పేదవాడికి రైట్ టు ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ అందించాలనే దృఢ సంకల్పంతో మొత్తం ప్రభుత్వ పాఠశాలలు ఇంగ్లీష్ మీడియం వైపు అడుగులు వేయించాలని కొద్ది నెలల క్రితం బిల్లును తీసుకొచ్చాం. పేదవాడి జీవితాలు బాగు చేసే బిల్లు అని తెలిసినా కూడా దాన్ని కౌన్సిల్‌లో అడ్డుకున్నారు. సవరణలు సూచిస్తూ రిజెక్ట్ చేశారు. దీంతో ఆ బిల్లు మళ్లీ శాసనసభకు వచ్చింది. దీనిపై చర్చ కొనసాగిస్తున్నాం. దీన్ని తరువాత అడ్డుకున్నా.. అది చట్టం అయిపోతుంది. వాళ్లు ఏమీ చేయలేరని తెలిసి కూడా ఎందుకు అడ్డుకుంటున్నారో వాళ్లకే తెలియదు. పేదవాడికి న్యాయం చేసే కార్యక్రమాన్ని ఆలస్యం చేసేందుకు ఎందుకు పాకులాడుతున్నారో అర్థం కావడం లేదు. ఆ పేదపిల్లలకు జగన్ మామ తోడుగా ఉన్నాడు.. అందుకే కచ్చితంగా బిల్లును మళ్లీ ఇదే చట్టసభలో పెట్టి పేదవాడికి ఇంగ్లీష్ మీడియం అనేది ఒక హక్కుగా తీసుకొస్తామని చెబుతున్నాం.

ఒక్కో విద్యార్థికి రూ.1350 విలువైన కిట్ (బాక్స్)
అమ్మఒడి, మధ్యాహ్న భోజన పథకం, ఇంగ్లీష్ మీడియం చదువు, నాడు- నేడు కార్యక్రమాలతో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చబోతున్నాం. చివరకు మధ్యాహ్న భోజన పథకంలో మార్పులు చేసి మెనూ తయారు చేసి ఏ రోజు ఏం పెట్టాలో తయారు చేసి.. గోరుముద్ద అని పేరుపెట్టాం. ప్రతి అడుగులో పిల్లల జీవితాల మార్పు దిశగా అడుగులు వేస్తున్నాం. పేద పిల్లల తల్లిదండ్రులపై భారం కూడా పడకుండా... జూన్ 12న బడులు తెరిచే సమయానికి ముందే.. జూన్ ఒకటి నాటికే విద్యా కానుక కింద ఒక్కొక్క విద్యార్థికి రూ.1350 విలువైన కిట్ అందించబోతున్నాం. ఈ కిట్‌లో స్కూల్ బ్యాగులు, నోట్‌బుక్స్, పాఠ్యపుస్తకాలు, మూడు జతల యూనిఫాం, బూట్లు, సాక్స్‌లు, బెల్టులు పెట్టి ఇవ్వబోతున్నాం. సుమారు 36.10 లక్షల మంది పిల్లలకు విద్యాకానుక కింద జూన్ 1న ఇచ్చేందుకు శ్రీకారం చుట్టబోతున్నాం. దీని కోసం సుమారు రూ.487 కోట్లు ఖర్చుచేస్తున్నాం. బడుగుల జీవితాల్లో మార్పు రావాలని అడుగులు వేస్తున్నాం. దేవుడి దయ, ప్రజలందరి ఆశీర్వాదంతో ఇవన్నీ చేయగలుగుతున్నాం. ఇలాంటి గొప్ప కార్యక్రమాలు చేసే అవకాశం దేవుడు ఇవ్వాలని, మీ అందరి ఆశీస్సులు ఉండాలని, ఇంగ్లీష్ మీడియం బోధన బిల్లుకు సంపూర్ణంగా మద్దతు తెలపాలని కోరుతున్నాను.
Published date : 24 Jan 2020 01:27PM

Photo Stories