ఇకపై ప్రైవేట్ డిగ్రీ కాలేజీల్లో కూడా కచ్చితంగా రిజర్వేషన్ల అమలు
Sakshi Education
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో అమలవుతున్న రిజర్వేషన్ల ప్రక్రియను అన్ని ప్రైవేట్ డిగ్రీ కాలేజీల్లోనూ వచ్చే ఏడాది నుంచి కచ్చితంగా అమల్లోకి తీసుకురానున్నారు.
ప్రతి కాలేజీలో ఆయా వర్గాలకు ప్రభుత్వం నిర్దేశించిన కోటా ప్రకారం సీట్లు కేటాయిస్తారు. తద్వారా 2 లక్షల మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, మహిళా, దివ్యాంగ విద్యార్థులకు లబ్ధి చేకూరనుంది. ఇందుకోసం వచ్చే విద్యా సంవత్సరం నుంచి డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాలను ఆన్‌లైన్‌లో నిర్వహించనున్నారు. గురువారం యూనివర్సిటీల ఉపకులపతుల(వీసీలు) సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీష్‌చంద్ర, ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ప్రొఫెసర్ కె.హేమచంద్రారెడ్డి, కాలేజీ విద్య కమిషనర్ నాయక్ పాల్గొన్న ఈ సమావేశానికి పది మంది వీసీలు, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. కాలేజీలకు గుర్తింపు, అనుమతిపై నిర్ణయాలు తీసుకున్నారు. విద్యార్థుల హాజరు 25 శాతం కంటే తక్కువ ఉన్న కాలేజీల గుర్తింపును రద్దుచేయనున్నారు.
Published date : 20 Mar 2020 03:06PM