Skip to main content

ఈ గూడెం గ్రాడ్యుయేట్‌..లైఫ్‌ ఇస్తోందిలా..

సంధ్య తన గూడెంలో తొలి మహిళా గ్రాడ్యుయేట్‌. గతేడాదే డిగ్రీ అయింది. డిగ్రీ చదివిన అమ్మాయిలు చాలామంది ఈమధ్య పిల్లలకు ఉచితంగా ఆన్‌లైన్‌ క్లాస్‌ లు తీసుకుంటున్నారు. సంధ్య మాత్రం ఆఫ్‌లైన్‌ క్లాస్‌ లు తీసుకుంటోంది. గూడెంలో పిల్లలకు ఫోన్‌లు ఉంటాయా? నెట్‌ ఉంటుందా? అందుకే పిల్లల్ని గూడెంలోనే సేఫ్‌గా ఒక చోట చేర్చి, వారికి ఉచితంగా మేథ్స్, ఇంగ్లిష్‌ చెబుతోంది. మిగతా సబ్జెక్టులను.. పాఠాలుగా కాకుండా, జనరల్‌ నాలెడ్జిగా మార్చి చదువుపై ఆసక్తి, శ్రద్ధ కలిగిస్తోంది.
బడికి కూడా పంపలేని పేదరికం..
కరోనా థర్డ్‌ వేవ్‌ గురించిన భయమే తప్ప, చతికిల పడబోతున్న చదువుల థర్డ్‌ వేవ్‌ గురించి ఆలోచించే పరిస్థితి ఇప్పుడు ఎక్కడా లేదు. స్థోమత కలిగిన పిల్లలు ఎలాగో ఆన్‌లైన్‌లో కుస్తీలు పడుతున్నారు. కంప్యూటర్, కనీసం ఫోన్‌ లేని పిల్లలు బడీ లేక, ఇంట్లో పాఠాల సడీ లేక అలా ఉండిపోతున్నారు. పట్టణాలు, గ్రామాల్లోనే ఇలా ఉంటే.. ఇక ఏ టెలిఫోన్‌ సౌకర్యమూ, నెట్‌ కనెక్షన్‌ లేని ఆదివాసీ గూడేలలోని పిల్లల చదువుల మాటేమిటి? ఏ ‘వేవూ’ లేని రోజుల్లోనే పిల్లల్ని బడికి కూడా పంపలేని పేదరికం ఉంటుంది ఆ మారుమూల ప్రాంతాల్లో! మరి వారి పిల్లల భవిష్యత్తు మాటేమిటి?! వారి భవిష్యత్తుకు మాట ఇస్తోంది అన్నట్లుగానే.. సంధ్య అనే ఓ అమ్మాయి.. ఈ మధ్యే గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసుకున్న ఆ అమ్మాయి..తన గూడెం పిల్లల్ని దగ్గర కూర్చోబెట్టుకుని మరీ ‘ఆఫ్‌లైన్‌’ పాఠాలు బోధిస్తోంది. ఆన్‌లైన్‌కి దారే లేనప్పుడు ఆఫ్‌లైన్‌లోనే కదా పిల్లల చేరువకు వెళ్లాలి.

అంతకన్నా పెద్ద కారణం ఇదే..
సంధ్య కూడా వాళ్ల గూడెం అమ్మాయే. తమిళనాడు, కోయంబత్తూరుకు సమీపంలోని చిన్నంపతి గూడెంలోనే ఆమె పుట్టింది. అక్కడే డిగ్రీ వరకు చదివింది. గూడెంలో తొలి పట్టభద్రురాలు సంధ్య. ఏడాదిన్నరగా పిల్లలు చదువుల్లేకుండా ఉండిపోవడం ఆమె చూస్తూనే ఉంది. అందుకు కారణం కరోనానే అయినా, అంతకన్నా పెద్ద కారణం పేదరికం. ఆ సంగతి గ్రహించింది కనుకనే తనే స్వయంగా చదువు చెప్పడానికి పిల్లల్నందర్నీ జమ చేసింది. చిన్నపిల్లల చేత అక్షరాలు దిద్దించడం, పెద్ద పిల్లలకు మేథ్స్, ఇంగ్లిష్‌ నేర్పించడం ఇప్పుడు ఆమె దినచర్య. ‘పాఠం’ అనే మాటెప్పుడూ పిల్లలకు ఆసక్తికరంగా ఉండదు. అందుకే మాటగా, ఆటగా పాఠాలను నేర్పిస్తోంది. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుంటే సంధ్యకు ఏదో ఒక ఉద్యోగం రాకుండాపోదు. వర్క్‌ ఫ్రమ్‌ ఇవ్వకా పోరు. కానీ తన గూడెం పిల్లలకు దగ్గరగా ఉండి వారి చదువుల్ని చూసుకోవాలనుకుంది. ‘‘బడి వారికి దూరమైంది. బడి తెరిచేవరకు నేను వారికి దగ్గరగా ఉంటాను’’ అంటోంది సంధ్య.
Published date : 21 Jun 2021 12:16PM

Photo Stories