ఈ ఐదు చేస్తే చాలు- విద్యార్థులకే మేలు!
Sakshi Education
జీవితంలో విద్యార్ధులు ఉన్నత శిఖరాలను అధిరోహించాలంటే ఐదు పనులు చేయాలి.
- వేకువజామునే నిద్రలేవడం. కనీసం 30 లేదా 40 నిమిషాలపాటు వ్యాయామం చేయాలి. అప్పుడు మీరు శారీరకంగా బలపడతారు. దీన్నే ఫిజికల్ ఫిట్నెస్ అంటాం.
- ఆ తర్వా త సూర్యనమస్కారం చేయడం. ఎందుకంటే పొద్దున్నే లేచే అలవాటు ఎవరికి ఉంటుందో వారు మాత్రమే జీవితంలో ఎదగగలుగుతారు. సూర్యుడు ప్రతిరోజూ ఒకే సమయానికి ఉదయిస్తాడు. అది సమయపాలనకుప్రతీక. మీరు కూడా సూర్యుడి మాదిరిగా క్రమశిక్షణ పాటించడం అలవాటు చేసుకొంటే అది మీకు ఓ వరంగా మారుతుంది. జీవితాంతం సుఖంగా ఉండేందుకు తోడ్పడుతుంది.
- ఆలోచనలకు శిక్షణ ఇవ్వడం. లేదా నియంత్రించడం. ఈనాటి యువతరాన్ని క్రికెట్ నియంత్రిస్తోంది. ఇంకా చెప్పాలంటే శాసిస్తోంది. యువత దాని ఆధీనంలోకి వెళ్లిపోయారు. అలా ఏదో ఒకదానికి బానిసలైపోకుండా నియంత్రించుకోవాలి. ఇక సెల్‌ఫోన్ అయితే యువతను నియంత్రించడం లేదు. ఏకంగా శాసిస్తోంది. విద్యకోసం కేటాయించాల్సిన తమ అమూల్యమైన సమయాన్ని మొబైల్‌తో గడిపేస్తూ భవిష్యత్తును చేజేతులారా పాడుచేసుకొంటున్నారు. అర్థరాత్రి, అపరాత్రి, వేకువజామున ఇలా ఎప్పుడు మేలుకొస్తే అప్పుడు సామాజిక మాధ్యమాల్లో మునిగిపోతున్నారు. ఈ అలవాటు మీతోపాటు మిమ్మల్ని నమ్ముకొన్నవారిని భవిష్యత్తులో తీవ్ర ఇబ్బందులకు గురిచేయడం తథ్యం.
- నాలుగోది మనస్సును నియంత్రించుకోవడం. మనసు కళ్లెం లేని గుర్రం లాంటిది. ఏదో ఒకవైపునకు పరుగులు తీస్తూనే ఉంటుంది. మరి మనసును నియంత్రించడం ఎలా. దానికొకటే మార్గం. అదే శ్వాసప్రక్రియ. సరిగ్గా చెప్పాలంటే శ్వాస నియంత్రణ. ఇందుకు ధ్యానం, ప్రాణాయామం చేయడమొక్కటే మార్గం. ఈ రెండు చేయగలిగినవారు జీవితంలో ఏదైనా సాధించగలుగుతారు.
- ఇక ఐదోది. మాటలకు శిక్షణ ఇవ్వడం. కొంతమంది అందరిలో ఉన్నప్పుడు బాగానే మాట్లాడతారుగానీ వేదిక ఎక్కి మాట్లాడమంటే బెంబేలెత్తిపోతారు. ఎందుకు అంత భయమంటే వారికి మాట్లాడేందుకు అవసరమైన పరిజ్ఞానం లేకపోవడమే. ఆ పరిజ్ఞానం రావాలంటే అబ్దుల్ కలాం, మోక్షగుండం విశ్వేశ్వరయ్య వంటి వారి జీవితచరిత్ర పుస్తకాలు చదవాలి. పుస్తక పఠనం వల్ల ఎంతో జ్ఞానం వస్తుంది.
Published date : 05 Mar 2020 04:40PM