Skip to main content

హెచ్‌1బీపై ఆంక్షలతో అమెరికాకూ నష్టమే...: నాస్కామ్‌

న్యూఢిల్లీ: హెచ్‌1బీ వీసాలపై ఆంక్షల వల్ల అమెరికన్‌ కంపెనీలకు ప్రతిభావంతులైన నిపుణుల లభ్యత తగ్గిపోతుందని దేశీ ఐటీ సంస్థల సమాఖ్య నాస్కామ్‌ పేర్కొంది.
ఇలాంటి చర్యలు అమెరికా ఆర్థిక వ్యవస్థ, ఉద్యోగాలకు కూడా నష్టదాయకమేనని వ్యాఖ్యానించింది. మరో నెలలో అధ్యక్ష ఎన్నికలున్న నేపథ్యంలో తమ ఉద్యోగుల ప్రయోజనాలను కాపాడేందుకంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రభుత్వం హెచ్‌1బీ వీసాలపై కొత్తగా ఆంక్షలు విధించింది. వీటి ప్రకారం స్పెషాలిటీ వృత్తులు, ఉద్యోగులు, సంస్థలు మొదలైన వాటి నిర్వచనాలను మార్చేయడంతో పాటు థర్డ్‌ పార్టీ వర్క్‌సైట్‌లో పనిచేసే వారి హెచ్‌1బీ వీసాల కాలపరిమితిని ఏడాదికి కుదించేశారు. ఇలాంటి పరిణామాలన్నీ వేలకొద్దీ భారతీయ ఐటీ నిపుణులపై ప్రతికూల ప్రభావం చూపనున్నాయి.

‘హెచ్‌1బీ వీసాల నిబంధనల మార్పులతో ప్రతిభావంతుల లభ్యత తగ్గిపోవడంతో పాటు అమెరికా ఎకానమీకి, ఉద్యోగాలకు నష్టం జరుగుతుంది. అమెరికా ప్రయోజనాలకు ముప్పు ఏర్పడుతుంది. కరోనా సంక్షోభం నుంచి గట్టెక్కేందుకు జరుగుతున్న పరిశోధన, అభివృద్ధి కార్యకలాపాలు మందగిస్తాయి. నిపుణులు అందుబాటులో ఉండటం అమెరికా మార్కెట్‌కు అవసరం. కరోనా రికవరీ దశలో ఇది మరీ కీలకం‘ అని నాస్కామ్‌ ఒక ప్రకటనలో తెలిపింది. వీసాలపై అపోహలతోనే ఆంక్షలు విధించినట్లు కనిపిస్తోం దని, అమెరికా ఎకానమీ.. ఉద్యోగాలను కాపాడాలన్న లక్ష్య సాధనకు ఇవి ప్రతికూలమైనవని పేర్కొంది.
Published date : 08 Oct 2020 01:06PM

Photo Stories