Skip to main content

గురుకులాల్లో ఐదో తరగతి ప్రవేశాలకు ఈసారిబ్రేక్!

సాక్షి, హైదరాబాద్: గురుకులం అడ్మిషన్లకు కరోనా అడ్డంకి కాబోతోంది. ఐదో తరగతి ప్రవేశాలకు ఈసారి బ్రేక్ పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.
కోవిడ్-19 తీవ్రత రోజురోజుకూ పెరుగుతుండటమే దీనికి కారణం. సాధారణ పాఠశాలల్లో విద్యార్థులు ఉదయం హాజరై సాయంత్రానికి ఇంటి ముఖం పడతారు. కానీ, గురుకుల పాఠశాలల్లో బోధన, అభ్యాసన, వసతి అంతా ఒకేచోట ఉంటుంది. రాష్ట్ర వ్యాప్తంగా 700కు పైగా గురుకుల పాఠశాలలున్నాయి. ఒక్కో పాఠశా లలో ఐదో తరగతి నుంచి పదో తరగతివరకు (ఆరు తరగతులు) ఒక్కో తరగతిలో రెండు సెక్షన్లు, ప్రతి సెక్షన్‌కు 40మంది పిల్లలుం టారు. ఈ లెక్కన ఒక్కో పాఠశా లలో 480 మంది విద్యార్థులుం టారు. ప్రతి సంవత్సరం మే నెలాఖరుకే ఐదో తరగతిలో అడ్మి షన్ల ప్రక్రియ పూర్తయ్యేది. ఈసారి క్షేత్రస్థాయి నుంచి దరఖాస్తులు స్వీకరించినా కరోనా కారణంగా ప్రవేశ పరీక్ష నిర్వహించకపోవడంతో అడ్మిషన్ల ప్రక్రియ స్తంభించింది.

ఫిజికల్ డిస్టెన్స్ కీలకం: కొత్తగా ఏర్పాటు చేసిన, అద్దె భవనాల్లో కొనసాగుతున్న గురుకుల పాఠశాలల భవనాల్లో ఫిజికల్ డిస్టెన్స్ పాటించడం ఇబ్బందే. ఈ ఏడాది ఐదో తరగతి అడ్మిషన్లు నిలిపివేస్తే విద్యార్థుల సంఖ్య తగ్గుతుంది. అప్పుడు ఫిజికల్ డిస్టెన్స్ పాటించే వీలుంటుందని సొసైటీలు భావిస్తున్నాయి. పదేళ్లలోపు పిల్లల ఆరోగ్యంపట్ల మరిన్ని ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలని ఐసీఎంఆర్ పదేపదే చెబుతోంది. ఈ నేపథ్యంలో ఐదో తరగతి ప్రవేశాలకు బ్రేక్ ఇస్తే మంచిదని అధికారులు అంటున్నారు. ఇటీవల గురుకుల సొసైటీ కార్యదర్శులు నిర్వహించిన సమావేశాల్లోనూ ఇదే అభిప్రాయం వ్యక్తమైంది. అయితే ప్రభుత్వ నిర్ణయాన్నిబట్టి అడ్మిషన్లు చేపట్టడమో, నిలిపివేయడమో జరుగుతుంది. ఒకట్రెండు రోజుల్లో మరోవిడత అన్‌లాక్ ప్రక్రియ ప్రారంభం కానుండగా కేంద్రం ఇచ్చే మార్గదర్శకాలను పరిశీలించిన తర్వాత గురుకుల సొసైటీలు ప్రభుత్వానికి నివేదికలు సమర్పించనున్నట్లు గురుకుల సొసైటీ ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’తో అన్నారు.
Published date : 31 Aug 2020 05:10PM

Photo Stories