గ్రంథాలయాలకే అమెరికన్ల ప్రాధాన్యం!
Sakshi Education
న్యూయార్క్: ఇంట్లోకి టీవీలు, ల్యాప్‌టాప్‌లు.. చేతుల్లోకి మొబైల్‌లు వచ్చాక గ్రంథాలయాలకు వెళ్లే వారి సంఖ్య బాగా తగ్గిపోయిందనడంలో సందేహమే లేదు.
అయితే, అమెరికాలో మాత్రం ఇప్పటికీ లైబ్రరీకి వెళ్లేవారు ఎక్కువేనని తేలింది. అంతేకాదు, వాస్తవానికి అక్కడ థియేటర్ల కంటే గ్రంథాలయాలకే ఎక్కువగా వెళుతున్నారని తాజా అధ్యయనమొకటి చెబుతోంది. గాలప్ పోల్ అనే సంస్థ ఏడాదిలో అమెరికన్లు తమకు నచ్చిన ప్రాంతాలను ఎన్నిసార్లు చుట్టివస్తున్నారనే దానిపై సర్వే జరిపింది. సంస్థ ప్రతినిధి జస్టిన్ మెక్‌కార్తీ వివరాల ప్రకారం.. అమెరికాలో గ్రంథాలయాలను అక్కడి వారు ఏడాదికి సగటున 10.5 సార్లు సందర్శిస్తున్నారని తేలింది. కాగా థియేటర్లు, లైవ్ మ్యూజిక్, ఈవెంట్స్, చారిత్రాత్మక ప్రదేశాలను ఏడాదికి 4 సార్లు, పార్క్‌లను ఏడాదికి 1.5 సార్లు, జూలను 0.9 సార్లు సందర్శిస్తున్నట్లు తేలింది. కాగా ఈ సర్వేలో పబ్లిక్ లైబ్రరీలను సందర్శిస్తున్న వారిలో పురుషుల సంఖ్య కంటే మహిళల సంఖ్య రెండు రెట్లు ఎక్కువగా ఉండడం విశేషం. దీంతో పాటు లైబ్రరీకి వచ్చే వారిలో ఎగువ తరగతితో పోలిస్తే దిగువ తరగతి నుంచి వచ్చేవారే ఎక్కువగా ఉన్నట్లు తేలింది.
Published date : 31 Jan 2020 02:57PM