ఎస్వీయూ పరిశోధనలకు పేటెంట్.. నాగజెముడు, బ్రహ్మజెముడు పండ్లలో పోషక విలువలు ఉన్నట్లు గుర్తింపు
Sakshi Education
యూనివర్సిటీ క్యాంపస్ (తిరుపతి): నాగజెముడు, బ్రహ్మజెముడు మొక్కలపై ఎస్వీ యూనివర్సిటీ హోం సైన్స్ విభాగంలో పూర్వ పరిశోధక విద్యార్థి డాక్టర్ ఎస్.చెన్నకేశవరెడ్డి చేసిన పరిశోధనలకు మూడు పేటెంట్లు లభించాయి.
రాయలసీమ ప్రాంతంలో పెరిగే ఈ మొక్కల నుంచి లభించే పండ్లలో అధిక పోషక విలువలతో పాటు కాలేయం, కేన్సర్ నివారణకు దోహదపడే ఔషధ గుణాలున్నట్లు ఆయన గుర్తించారు. ఈ పండ్ల ఉత్పత్తులు ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల్లో ఉపయోగించవచ్చని గుర్తించి, వాటితో స్క్వాష్, ఫ్రూట్ బార్‌లను సైతం తయారు చేశారు. అసిస్టెంట్ ప్రొఫెసర్ కేవీ సుచరిత పర్యవేక్షణలో పరిశోధన చేసిన చెన్నకేశవరెడ్డి.. తన పరిశోధనలకు పేటెంట్ల కోసం నేషనల్ బయోడైవర్సిటీ బోర్డుకు దరఖాస్తు చేశారు. ఈ ప్రతిపాదనలను పరిశీలించిన నేషనల్ బయోడైవర్సిటీ బోర్డు పేటెంట్లు మంజూరు చేస్తూ ఎస్వీయూకు ఉత్తర్వులు పంపింది. పేటెంట్లు రావడం పట్ల ఎస్వీయూ వీసీ ప్రొఫెసర్ కె.రాజారెడ్డి సోమవారం చెన్నకేశవరెడ్డిని, అధ్యాపకులను అభినందించారు. ఈ కార్యక్రమంలో పర్స్ సెంటర్ కో ఆర్డినేటర్ ప్రొఫెసర్ డీవీఆర్ సాయిగోపాల్, డాక్టర్ కేవీ సుచరిత పాల్గొన్నారు.
Published date : 19 Jan 2021 04:03PM