Skip to main content

ఎస్సీ హాస్టళ్లలో పెరిగిన హాజరు శాతం

సాక్షి, అమరావతి: లాక్‌డౌన్ పరిస్థితుల అనంతరం క్లాసులు తిరిగి ప్రారంభం కావడంతో ఎస్సీ హాస్టళ్లు, గురుకుల స్కూళ్లలో విద్యార్థుల హాజరు శాతం క్రమంగా పెరుగుతోంది.
దాదాపు 80 శాతం వరకూ విద్యార్థులు హాజరవుతున్నట్లు అధికారులు తెలిపారు. మొదట పోస్టు మెట్రిక్ హాస్టళ్లు ప్రారంభం కాగా ఇటీవల ప్రీ మెట్రిక్ హాస్టళ్లు ప్రారంభించారు. ప్రస్తుతం హైస్కూలు స్థాయిలో క్లాసులు మొదలయ్యాయి. 759 (బాలురు 469, బాలికలు 290) ప్రీ మెట్రిక్ హాస్టళ్లు రాష్ట్రంలో ఉన్నాయి. 3 నుంచి 10 వ తరగతి వరకు 77,478 మంది విద్యార్థులు హాస్టళ్లలో ఉంటున్నారు. ప్రభుత్వం విద్యార్థులకు పలు సౌకర్యాలు అందిస్తోంది. పుస్తకాలు, స్కూలు యూనిఫాం, దుప్పట్లు, స్టేషనరీ, స్కూలు బ్యాగులు, బెల్టులు, తువ్వాళ్లు, నైట్‌వేర్, ట్రాక్ సూట్, హవాయి చప్పల్స్, ప్లేట్లు, గ్లాస్‌లు, ట్రంక్ బాక్స్‌లు, బ్లాక్ షూ, వైట్ కాన్వాస్ షూ ఒక్కొక్క జత, సాక్స్‌లు రెండు జతలు, స్పోర్‌ట్స మెటీరియల్స్ ఇస్తున్నారు. ప్రీ మెట్రిక్ హాస్టళ్లలో డైట్ చార్జీలు రూ. 1,000 నుంచి రూ. 1,400 వరకు ఇస్తున్నారు.

పోస్టు మెట్రిక్ హాస్టళ్లు ఇలా..
రాష్ట్రంలో 308 (153 బాలురు, 155 బాలికలు) పోస్ట్ మెట్రిక్ హాస్టళ్లు పనిచేస్తున్నాయి. వీటిలో ఇంటర్మీడియెట్ నుంచి పీహెచ్‌డీ వరకూ చదువుతున్న విద్యార్థులకు ప్రభుత్వం వసతి కల్పిస్తున్నది. ఈ హాస్టళ్లలో 32,498 మంది విద్యార్థులు ఉంటున్నారు.

ఎస్సీ గురుకులాల్లో..
ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో ఇప్పటి వరకు విద్యార్థులకు జూమ్ ద్వారా ఆన్‌లైన్ క్లాసులు నిర్వహిస్తున్నారు. కొంతకాలంగా తల్లిదండ్రులు తమ పిల్లలను స్కూళ్లకు పంపించేందుకు అంగీకారం తెలుపుతుండటంతో ఆ స్కూళ్లలో కూడా హాజరు శాతం పెరుగుతోంది. మొత్తం 189 గురుకుల స్కూళ్లలో 1,10,000 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఆంగ్ల మాధ్యమంలో విద్యాబోధన జరుగుతున్నది. 5వ తరగతి నుంచి ఇంటర్ వరకు విద్యార్థుల అడ్మిషన్‌స ఉంటాయి. 189 పాఠశాలల్లో 181 పాఠశాలలకు సొంత భవనాలు ఉన్నాయి. మిగిలిన అద్దె భవనాల స్థానంలో రూ. 90 కోట్లతో శాశ్వత ప్రభుత్వ భవనాల నిర్మాణాలు జరుగుతున్నాయి.
Published date : 27 Jan 2021 05:11PM

Photo Stories