Skip to main content

ఏపీలో 58 ఐఏఎస్ పోస్టులు ఖాళీ: డాక్టర్ జితేంద్రసింగ్

సాక్షి, న్యూఢిల్లీ/రాజమహేంద్రవరం రూరల్: డెరైక్ట్ రిక్రూట్‌మెంట్, ప్రమోషన్ల ద్వారా ఆంధ్రప్రదేశ్‌లో 239 మంది ఐఏఎస్ అధికారులను నియమించాల్సి ఉండగా ప్రస్తుతం వారి సంఖ్య 181 మాత్రమే ఉందని కేంద్రప్రభుత్వం తెలిపింది.
రాజ్యసభలో ఫిబ్రవరి 6 (గురువారం)నవైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు జవాబిస్తూ కేంద్ర సిబ్బంది వ్యవహారాల మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్రసింగ్ ఈ విషయం తెలిపారు. ఖాళీలను డెరైక్ట్ రిక్రూట్‌మెంట్, ప్రమోషన్ల ద్వారా భర్తీ చేయడం నిరంతర ప్రక్రియ అని మంత్రి చెప్పారు. దేశవ్యాప్తంగా ఏళ్ల తరబడి భర్తీ కాకుండా మిగిలిపోతున్న ఐఏఎస్ పోస్టులను భర్తీ చేయడానికి ప్రభుత్వం అదనంగా 1,000 మంది ఐఏఎస్‌లను నియమిస్తుందా అన్న మరో ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ అలాంటి ఆలోచన లేదని చెప్పారు. కేడర్ మేనేజ్‌మెంట్‌లో సమన్వయం పాటించడం, ఐఏఎస్ అధికారుల భవిష్యత్ అవకాశాలు వంటి అంశాలను దృష్టిలో పెట్టుకుని ఏడాదికి 180 మంది ఐఏఎస్‌లను మాత్రమే రిక్రూట్ చేసుకోవాలన్నది ప్రభుత్వ విధానమని అన్నారు.
Published date : 07 Feb 2020 02:33PM

Photo Stories