Skip to main content

ఏపీ సమగ్ర శిక్షా అభియాన్ద్వారా పాఠశాలల్లో.. స్మార్ట్, డిజిటల్ తరగతులు!

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో సమగ్ర శిక్షా అభియాన్ (ఎస్‌ఎస్‌ఏ) కింద పలు వినూత్న ప్రాజెక్టులకు పాఠశాల విద్యాశాఖ కసరత్తు చేపట్టింది.
ఈ ప్రాజెక్టుల ద్వారా పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనతోపాటు, విద్యాభివృద్ధి కార్యక్రమాలను మరింత విసృ్తతంగా అమలు చేయించనుంది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఈ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టేలా ప్రణాళికలను అధికారులు సిద్ధం చేయిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాలను అనుసరించి వీటికి రూపకల్పన చేయిస్తున్నారు.

వృత్తి విద్యకు ప్రాధాన్యం
విద్యార్థులకు భవిష్యత్తులో ఉపాధిని పెంచేలా వృత్తి విద్యాంశాలపై ప్రభుత్వం దృష్టి సారిస్తోంది. మాధ్యమిక, ఆపై తరగతుల్లో వీటికి ప్రాధాన్యమిస్తారు. స్థానిక డిమాండ్‌ను అనుసరించి వివిధ అంశాలు ఇందులో ఉంటాయి.

ఆకాంక్షపూర్వక జిల్లాలకు ప్రాధాన్యత
దేశంలో ఆకాంక్ష పూర్వక జిల్లాలు (యాస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్) కింద 117 జిల్లాలను కేంద్రం గుర్తించగా అందులో ఏపీకి సంబంధించి విజయనగరం, విశాఖ, వైఎస్సార్ జిల్లాలున్నాయి. ఈ జిల్లాల్లో విద్యారంగ కార్యకలాపాలకు ఎస్‌ఎస్‌ఏ ద్వారా ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు. పూర్వ ప్రాథమిక పాఠశాలల ఏర్పాటు, టీచర్ల నియామకం, ప్రాథమిక, ప్రాథమికోన్నత, మాధ్యమిక పాఠశాలల్లో మౌలిక సదుపాయాల ఏర్పాటుకు ప్రాధాన్యమిస్తారు. ఈ దిశగా ఎస్‌ఎస్‌ఏ కార్యక్రమాల కింద కొత్త ప్రణాళికలకు సంబంధించి వర్కుషాప్‌ను ఇటీవలే పాఠశాల విద్యా కమిషనర్, ఎస్‌ఎస్‌ఏ రాష్ట్ర ప్రాజెక్టు డైరక్టర్ వి.చినవీరభద్రుడు ప్రారంభించి పలు సూచనలు అందించారు.

5 రకాల ప్రాజెక్టులు
  • కేంద్ర మానవవనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఎస్‌ఎస్‌ఏ ప్రాజెక్టు అప్రూవల్ బోర్డు (పీఏబీ) తొలిదశలో 5 ప్రాజెక్టులను పరిగణనలోకి తీసుకొనే అవకాశాలున్నందున ఆ దిశగా రాష్ట్ర అధికారులు దృష్టి సారించారు. కేంద్రం ఆమోదం పొందేలా స్పష్టమైన లక్ష్యాలు, ప్రక్రియలు, ఫలితాలను నిర్దేశిస్తూ ఈ ప్రాజెక్టులను రూపొందింపచేస్తున్నారు.
  • రాష్ట్రంలోని అన్ని ఉన్నత, మాధ్యమిక పాఠశాలల్లో ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ (ఐసీటీ) డిజిటల్ ఇనిషియేటివ్‌‌స కింద స్మార్ట్ తరగతి గదులు, ఐసీటీ ల్యాబ్‌లను ఏర్పాటుచేయనున్నారు.
  • పాఠశాల విద్యలో ప్రీ ప్రైమరీకి కేంద్రం ప్రాధాన్యత ఇస్తున్నందున ఆ ప్రణాళికలను అధికారులు సిద్ధం చేయిస్తున్నారు.
  • విద్యా సదుపాయాలు అందుబాటులో లేని ప్రాంతాలను గుర్తించి కొత్త పాఠశాలల ఏర్పాటు, ఉన్న పాఠశాలల ఉన్నతీకరణ వంటి చర్యలు తీసుకుంటారు.
  • బోధనాభ్యసన ప్రక్రియలను మరింత పటిష్టం చేసేందుకు కేంద్రం ఏర్పాటు చేసిన ‘నిష్టా’ శిక్షణ కార్యక్రమాలను అమలు చేస్తారు.
  • బడి బయటి పిల్లలను గుర్తించడానికి సమగ్ర సర్వేలు చేస్తారు. వలస కుటుంబాల్లోని పిల్లలను గుర్తిస్తారు. వారికి ప్రత్యేక శిక్షణ ఇచ్చి తరగతుల్లో చేర్పించనున్నారు.
Published date : 21 Mar 2020 03:06PM

Photo Stories