Skip to main content

ఏపీ సచివాలయ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోమ్

సాక్షి, అమరావతి: కరోనా వైరస్ వ్యాప్తి నిరోధించడంలో భాగంగా రాష్ట్ర సచివాలయం, హెచ్‌వోడీ కార్యాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగుల్లో 50 శాతం మందిని ఏప్రిల్ 4 వరకు ఇంటి నుంచే పనిచేయించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
ఈ మేరకు సీఎస్ నీలం సాహ్ని ఉత్తర్వులు జారీ చేశారు. 50 శాతం మంది ఇంటి నుంచి, 50 శాతం మంది కార్యాలయాల్లో ఉండి పనిచేసేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖలకు ఆదేశాలిచ్చారు. సెక్రటేరియేట్‌లోని సెక్షన్ ఆఫీసర్స్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్స్, అంతకంటే దిగువ స్థాయి ఉద్యోగులను 50 శాతం చొప్పున రెండు గ్రూపులుగా విభజించి 50 శాతం మందిని ఇంటి నుంచి, ఒక వారం ఆఫీసు నుంచి మార్చిమార్చి పనిచేయించాలని పేర్కొన్నారు. విభాగాధిపతులు, జిల్లా, కిందిస్థాయి కార్యాలయాల్లో హెచ్‌వోడీలు, నాన్-గెజిటెడ్ అధికారులను అలాగే రెండు గ్రూపులుగా విభజించి మార్చిమార్చి పనిచేయించాలని సూచించారు. గెజిటెడ్ అధికారులు మాత్రం కార్యాలయాలకు వచ్చి పనిచేయాలని, 60 ఏళ్లు దాటిన సలహాదారులు, చైర్‌పర్సన్‌లు, కన్సల్టెంట్లకు వర్క్ ఫ్రం హోమ్‌కు అనుమతించాలన్నారు. కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులకు ఇలాగే రొటేషన్ పద్ధతిలో ఇల్లు, ఆఫీసు నుంచి పనిచేసే అవకాశమివ్వాలని సూచించారు. అత్యవసర సేవలు అందించే ఉద్యోగులకు ఈ నిబంధనలు అమలు కావన్నారు.
Published date : 23 Mar 2020 05:23PM

Photo Stories