Skip to main content

ఎంజేపీఏపీ బీసీఆర్‌జేసీ సెట్-2020కి దరఖాస్తులు

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మహాత్మా జ్యోతిబా పూలే ఆంధ్రప్రదేశ్ వెనుకబడిన తరగతుల గురుకుల జూనియర్ కాలేజీ (ఎంజేపీఏపీ బీసీఆర్‌జేసీ)ల్లో ఇంటర్మీడియెట్ మొదటి సంవత్సరంలో ప్రవేశాలకు ప్రకటన విడుదలైంది.
ప్రస్తుతం పదో తరగతి చదువుతూ మార్చిలో పబ్లిక్ పరీక్షలు రాయబోయే విద్యార్థులు ప్రవేశాలకు అర్హులు. వీరు ఫిబ్రవరి 25 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రవేశపరీక్షలో ప్రతిభ ఆధారంగా విద్యార్థులను ఎంపిక చేస్తారు. ప్రవేశం పొందే విద్యార్థి కుటుంబానికి ఏడాదికి రూ.లక్ష లోపు ఆదాయం ఉండాలి. ఈ మేరకు తహసీల్దార్ ఇచ్చిన ఆదాయ ధృవీకరణ పత్రాన్ని సమర్పించాల్సి ఉంటుంది.

రాష్ట్రంలో 14 బీసీ గురుకుల కళాశాలలు.. 2,080 సీట్లు :
రాష్ట్రంలో మొత్తం 14 బీసీ గురుకుల కళాశాలలు ఉన్నాయి. ఇందులో ఏడు బాలికలకు, ఏడు బాలురకు కేటాయించారు. బాలికలకు 1,000 సీట్లు ఉండగా.. బాలురకు 1,080 సీట్లు ఉన్నాయి. ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సీఈసీ గ్రూపులు అందుబాటులో ఉన్నాయి. విద్యార్థులు పూర్తి వివరాలకు www.jnanabhumi.ap.gov.in చూడాలని బీసీ గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి ఎ.కృష్ణమోహన్ తెలిపారు.

పరీక్ష విధానం:
ప్రవేశపరీక్ష ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది. పదో తరగతి సిలబస్ నుంచి మల్టిపుల్ చాయిస్ విధానంలో ప్రశ్నలు అడుగుతారు. మ్యాథమ్యాటిక్స్ నుంచి 20 ప్రశ్నలు (20 మార్కులు), ఫిజికల్ సైన్స్ నుంచి 20 ప్రశ్నలు (20 మార్కులు), బయోలాజికల్ సైన్స్ నుంచి 20 ప్రశ్నలు (20 మార్కులు), సోషల్ స్టడీస్ నుంచి 15 ప్రశ్నలు (15 మార్కులు), ఇంగ్లిష్ 15 ప్రశ్నలు (15 మార్కులు), లాజికల్ రీజనింగ్ 10 ప్రశ్నలు (10 మార్కులు) ఉంటాయి. మొత్తం 100 మార్కులకు ప్రశ్నపత్రం ఉంటుంది. తప్పుగా గుర్తించిన సమాధానాలకు నెగెటివ్ మార్కులు ఉంటాయి. ప్రశ్నపత్రం ఇంగ్లిష్ మాధ్యమంలో మాత్రమే ఉంటుంది.

మార్చి 15న ఫలితాలు :
రాత పరీక్ష మార్చి 8న (ఆదివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు) జరుగుతుంది. మార్చి 15న ఫలితాలను ప్రకటిస్తారు. ఎంపికై న విద్యార్థులకు ఏప్రిల్ 15 నుంచి 17లోపు సీట్లు కేటాయిస్తారు.

75 శాతం సీట్లు బీసీ గురుకుల విద్యార్థులకే..
ఇంటర్మీడియెట్ మొదటి ఏడాది ప్రవేశాల్లో బీసీ-ఏలకు 20 శాతం, బీసీ-బీలకు 28 శాతం, బీసీ -సీలకు 3 శాతం, బీసీ -డీలకు 19 శాతం, బీసీ -ఈలకు 4 శాతం, ఎస్సీలకు 15 శాతం, ఎస్టీలకు 6 శాతం, ఈబీసీలకు 2 శాతం, అనాధలకు 3 శాతం చొప్పున రిజర్వేషన్ ఉంటుంది. ప్రత్యేకించి మత్స్యకారుల పిల్లల కోసం ఏర్పాటు చేసిన కాలేజీల్లో మత్స్యకార వర్గానికి చెందిన విద్యార్థులకు 46 శాతం, బీసీ-ఏలకు 7 శాతం, బీసీ-బీలకు 10 శాతం, బీసీ -సీలకు 1 శాతం, బీసీ -డీలకు 7 శాతం, బీసీ -ఈలకు 4 శాతం, ఎస్సీలకు 15 శాతం, ఎస్టీలకు 6 శాతం, ఈబీసీలకు 1 శాతం, అనాధ పిల్లలకు 3 శాతం ప్రకారం రిజర్వేషన్లు అమలు చేస్తారు. అయితే.. మొత్తం మీద 75 శాతం సీట్లను బీసీ గురుకుల స్కూళ్లు, బీసీ హాస్టళ్లలో చదువుకున్న వారికే కేటాయిస్తారు. మిగిలిన 25 శాతం సీట్లలోకి ఇతర చోట్ల చదువుకున్న వారిని తీసుకుంటారు.
Published date : 06 Feb 2020 04:06PM

Photo Stories