Skip to main content

DDMA Guidelines to schools: సెప్టెంబర్‌ 1 నుంచి దశల వారీగా తెరుచుకోనున్న విద్యాసంస్థలు

సాక్షి, న్యూఢిల్లీ: విద్యా సంస్థలు కరోనా మహమ్మారి వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు కోవిడ్‌ –19 నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని ఢిల్లీ విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది.
సెప్టెంబర్‌ 1వ తేదీ నుంచి పాఠశాలలు, కళాశాలలు తెరుచుకుంటున్న నేపథ్యంలో డీడీఎంఏ సోమవారం మార్గదర్శకాలను జారీ చేసింది. దేశ రాజధాని ఢిల్లీలో కరోనా మహమ్మారి పాజిటివ్‌ కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టడం, పరిస్థితిలో కాస్త మెరుగుదల కనిపించడంతో సెప్టెంబర్‌ 1 నుంచి పాఠశాలలు, కళాశాలలు పునః ప్రారంభించాలని శుక్రవారం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. గత ఏడు రోజులుగా ఢిల్లీలో రోజుకు సగటున 32 కేసులు నమోదయ్యాయి. విద్యా సంస్థలు సెప్టెంబర్‌ 1 నుంచి దశలవారీగా భౌతిక తరగతులను ప్రారం భించవచ్చని ప్రభుత్వం ప్రకటించింది.

వివిధ సమయాల్లో భోజన విరామాలు
డీడీఎంఏ తాజా మార్గదర్శకాల ప్రకారం, తరగతి గదికి గరిష్టంగా 50 శాతం మంది విద్యార్థులను సామర్థ్యాన్ని బట్టి విద్యాసంస్థలకు పిలవవచ్చు. మధ్యాహ్న సమయాల్లో విద్యార్థుల రద్దీని నివారించడానికి భోజన విరామాన్ని అందరికీ ఒకేసారికాకుండా కొన్ని తరగతులకు ఒకసారి చొప్పున.. వేర్వేరుగా ఇవ్వాలి. భోజన విరామాలు అన్నీ బహిరంగ ప్రదేశాలలో మాత్రమే నిర్వహించాలని సూచించారు. అత్యవసర ఉపయోగం కోసం తప్పనిసరిగా ఒక క్వారంటైన్‌ గదిని ఏర్పాటు చేయాలి. విద్యాసంస్థల్లో విద్యార్థులు ఉన్న సమయాల్లో సందర్శకులు రాకుండా ఆంక్షలు విధించాలి.

కంటైన్మెంట్‌ జోన్ల వారికి నో ఎంట్రీ
కరోనా మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో కోవిడ్‌ కంటైన్‌మెంట్‌ జోన్లలో నివసిస్తున్న విద్యార్థులు, ఉపాధ్యాయులను భౌతిక తరగతుల కోసం విద్యాసంస్థల్లోకి అనుమతించరాదని డీడీఎంఏ పాఠశాలలను ఆదేశించింది. సెప్టెంబర్‌ 1 నుంచి అన్ని ప్రభుత్వ పాఠశాలలు 9–12 తరగతులకు తెరుచుకోనున్నాయి. అన్ని ప్రైవేట్‌ పాఠశాలలు కూడా 9–12 తరగతులను తిరిగి ప్రారంభించడానికి అవకాశం కల్పించారు. కోచింగ్‌ సెంటర్లు సైతం 9–12 తరగతుల విద్యార్థులకు శిక్షణా తరగతులను నిర్వహించుకోవచ్చని మార్గదర్శకాల్లో సూచించారు. కాగా జూనియర్‌ తరగతులను తిరిగి తెరిచే విషయంలో ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని అధికారిక వర్గాలు తెలిపాయి. పాఠశాలకు హాజరు కావాలనుకుంటున్న విద్యార్థులు తల్లిదండ్రులు/సంరక్షకుల నుంచి ఆమోదం తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు. వీటికితోడు విద్యాసంస్థల ప్రవేశద్వారం వద్ద థర్మల్‌ స్కానర్‌ తప్పనిసరిగా ఏర్పాటుచేయడమే కాకుండా విద్యార్థులకు, సిబ్బందికి మాస్క్ లు తప్పనిసరి అని ఆదేశించారు. పాఠశాలకు వచ్చే ఉపాధ్యాయులు, సిబ్బంది అందరూ వ్యాక్సిన్లు వేయించుకొనేలా చూడాల్సిన బాధ్యత విద్యాసంస్థల యాజమాన్యాలకు ఉంటుందని తెలిపారు.
Published date : 31 Aug 2021 03:51PM

Photo Stories