Skip to main content

దివ్యాంగుల ఉద్యోగాల భర్తీకి జనవరి 7న నోటిఫికేషన్

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ శాఖల్లో విభిన్న ప్రతిభావంతుల కోసం రిజర్వు చేయబడి, ప్రస్తుతం ఖాళీగా ఉన్న అన్ని ఉద్యోగాలను ప్రత్యేక నియామక ప్రక్రియ ద్వారా భర్తీ చేయనున్నట్టు విభిన్న ప్రతిభావంతులు, లింగమార్పిడి, వయోవృద్ధుల శాఖ సంచాలకులు కృతికా శుక్లా తెలిపారు.
ఇందుకోసం నిర్ణీత కాలవ్యవధితో కూడిన షెడ్యూల్‌ను సిద్ధం చేశామని వివరించారు. డిసెంబర్ 25వ తేదీలోపు వివిధ విభాగాల్లో ఖాళీ పోస్టులను గుర్తించి.. జనవరి 7న నోటిఫికేషన్ విడుదల చేయాలని ఆదేశించామని ఆమె తెలిపారు. జనవరి 31 నాటికి అన్ని దశలను దాటి నియామకాలను పూర్తి చేస్తామని చెప్పారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దివ్యాంగుల సమస్యల పరిష్కారానికి కట్టుబడి ఉన్నారని, సీఎం ఆదేశాల మేరకే ఈ ప్రత్యేక నియామక ప్రక్రియ చేపట్టామని స్పష్టం చేశారు. నియామకాల విషయంలో చేపట్టాల్సిన చర్యలపై స్పష్టమైన ఆదేశాలు జారీ చేశామని చెప్పారు. దీనిని సకాలంలో చేయని వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

జనవరి 31లోపు ఉపకరణాల పంపిణీ
విభిన్న ప్రతిభావంతులు, వయోవృద్ధుల కార్పొరేషన్ పరిధిలో అందుబాటులో ఉన్న విభిన్న ఉపకరణాలను కూడా జనవరి 31లోపు పంపిణీ చేస్తామని కృతికా శుక్లా తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా దివ్యాంగులకు ఉపకరించే 2,667 ఉపకరణాలు సిద్ధంగా ఉన్నాయని చెప్పారు. వీటిలో ట్రై సైకిళ్లు 123, వీల్‌చైర్స్ 174, ఊతకర్రలు 419, టచ్ ఫోన్లు 156, వినికిడి సాధనాలు 1,527, మరో 268 ఇతర ఉపకరణాలు పంపిణీకి సిద్ధంగా ఉన్నాయన్నారు. ఇప్పటికే కార్పొరేషన్‌కు అందిన దరఖాస్తులను పరిశీలించి, అర్హుల జాబితా తయారు చేస్తామని తెలిపారు. జిల్లాల కలెక్టర్లు, ప్రజాప్రతినిధుల సమక్షంలో పంపిణీ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని నిర్దేశించామని చెప్పారు.
Published date : 14 Dec 2020 03:52PM

Photo Stories